పిల్లలను ముద్దు పేర్లతో పిలిస్తే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మళ్లీ ఆ తప్పు..
వ్యక్తులను, ముఖ్యంగా పిల్లలను, ముద్దు పేర్లతో పిలవడం వారి పురోగతిని ఆపి, ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి పేరుకు ఉండే శక్తి, సానుకూలత ముద్దు పేర్లతో దూరమవుతుంది. ఇది పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పూర్తి పేర్లతోనే పిలవాలి.

మన నిత్య జీవితంలో చిన్నదిగా కనిపించే ఒక అలవాటు మన పురోగతిని, సానుకూల శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది మరేదో కాదు.. వ్యక్తులను, ముఖ్యంగా పిల్లలను, వారి పూర్తి పేరుతో కాకుండా ముద్దు పేర్లతో పిలవడం. ఈ అలవాటు ఆ వ్యక్తి జీవితంలో పురోగతిని ఆపివేస్తుందని, ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని పండితులు అంటున్నారు.
పేరు వెనుక దాగి ఉన్న శక్తి
ప్రతి పేరుకు దాని సొంత శక్తి, ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు చెబుతారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పూర్వీకుల పేర్లు, దేవతల పేర్లు లేదా అర్థవంతమైన పేర్లను మంచి ఉద్దేశ్యంతో పెడతారు. దైవిక శక్తి లేదా పెద్దల లక్షణాలు ఆ వ్యక్తిని వారి పూర్తి పేరుతో పిలిచినప్పుడు బదిలీ అవుతాయి. ఉదాహరణకు సూర్యోదయం సమయంలో సూర్యుడు మనకు కొత్త శక్తిని ఇచ్చినట్లే, పూర్తి పేరును పిలవడం ప్రతిరోజూ ఆ వ్యక్తికి సానుకూల శక్తిని తెస్తుంది. రామకృష్ణ పేరును రామ్ అని, శివకుమార్‌ను శివ అని పిలుస్తుంటాం. జ్యోతిష్యుల ప్రకారం, ఇలా పూర్తి పేరును వాడకపోతే, ఆ పేరులోని మంచి శక్తి, సానుకూలత ఆ వ్యక్తికి అందదు. పురోగతి ఆగిపోతుంది, చెడు శక్తులు చుట్టూ ఉండే అవకాశం ఉంది.
పిల్లల ఆత్మవిశ్వాసంపై దెబ్బ
ఇక చాలా ఇళ్లలో పిల్లలను ముద్దుగా పేర్లతో పిలవడం ఆచారం. అయితే కేవలం ముద్దు కోసమే కాకుండా కొన్నిసార్లు పిల్లల ఎత్తు, రంగు, బరువు, మాట లేదా అలవాటు ఆధారంగా పెట్టే మారుపేర్లు వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. బ్లాకీ, బోండం వంటి పేర్లతో పిల్లలను పిలుస్తుంటారు. ఇలాంటి పేర్లు పిల్లల మనసులో న్యూనతా భావాన్ని పెంచుతాయి. చిన్న వయసులో వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. స్కూల్లో స్నేహితులు ఆటపట్టించే అవకాశం ఉంది. ఇది వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది.
తల్లిదండ్రులకు ముఖ్య సలహా
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లలను వారి పూర్తి పేర్లతో లేదా గౌరవంతో కూడిన ఆప్యాయత పేర్లతో మాత్రమే పిలవాలి. పిల్లలను గౌరవంగా గుర్తించడం వల్ల వారు తమ గురించి మంచిగా ఆలోచించుకుంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఆరోగ్యకరమైన వ్యక్తిత్వ నిర్మాణానికి సహాయపడుతుంది. పిల్లలను అవమానించే లేదా సగం పేర్లతో పిలవడం వెంటనే ఆపండి. ఇది వారి మంచి భవిష్యత్తు కోసం మనం వేయగలిగే చాలా ముఖ్యమైన మొదటి అడుగు.
(ఈ కథనం మూలాలు, జ్యోతిష్య శాస్త్ర సూత్రాలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. వీటి ఆధారంగా మీరు తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా TV9 బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








