వందే భారత్
దేశంలోని మొదటి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అత్యాధునిక సదుపాయాలతో ఈ రైళ్లను తయారు చేశారు. ప్రస్తుతం దేశంలో 23 వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. 10 గంటల లోపు ప్రయాణ సమయంతో కూడిన దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే శాఖ నడుపుతోంది. గంటకు 180 కి.మీ వేగం కంటే ఎక్కువ స్పీడ్‌తో ప్రయాణించగల సామర్థ్యం ఈ రైళ్లకు ఉన్నప్పటికీ.. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఈ రైళ్లను గరిష్ఠంగా గంటకు 160 కి.మీ వేగంతో నడుపుతున్నారు. కేవలం 52 సెకన్ల వ్యవధిలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని పుంజుకోవడం వందే భారత్ రైళ్ల ప్రత్యేకత. 16 కోచ్‌ల వందే భారత్ రైలు తయారీకి దాదాపు రూ.115 కోట్ల వ్యయం అవుతుంది. తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2019 ఫిబ్రవరి 15న లాంఛ్ చేశారు. ఈ అత్యాధునిక రైలును గతంలో ట్రైన్ 18 అని పిలిచేవారు.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ని డిజైన్ చేసి తయారు చేసింది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద మొదటి రైలును రూ.97 కోట్ల వ్యయంతో 18 నెలల్లో తయారు చేయబడింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి వందే భారత్ రైలును 2023 జనవరి 15న సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ వచ్చువల్‌గా ప్రారంభించారు. మరో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను సికింద్రాబాద్- తిరుపతి, కాచిగూడ-యశ్వంత్‌పూర్, విజయవాడ – చెన్నై మధ్య నడుపుతున్నారు.