గుండెపోటు
నేటి కాలంలో ప్రతి ఒక్కరినీ హడలెత్తిస్తోన్న మహమ్మారి ఇది. దీంతో వృద్ధాప్యంలో మాత్రమే గుండె జబ్బులు వస్తాయనేది పాత మాటగా నిలిచిపోయింది. కేవలం 20 నుంచి 30 ఏళ్ల వయసులో కూడా గుండె జబ్బులు రావడమే అందుకు ప్రధాన కారణం. గత కొంత కాలంగా గుండె జబ్బులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీని బారీన పడుతున్నారు. గుండెపోటు, గుండె వైఫల్యం వంటి గుండె జబ్బుల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత.. గుండె సంబంధిత వ్యాధుల గ్రాఫ్ మరింత వేగంగా పెరుగుతోంది. అయితే తగు జాగ్రత్తలతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందుకోసం జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.
గుండె జబ్బులు రాకుండా నివారించేందుకు రోజూ క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలంటున్నారు. అందుకు భారీ వ్యాయామాలు చేయడం లేదా జిమ్‌కు వెళ్లడం వంటివి చేయాల్సిన అవసరం లేదని, రోజుకు కనీసం 15 నుంచి 25 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. వాకింగ్, రోప్ జంపింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి చేయవచ్చని చెబుతున్నారు. అలాగే ప్రతి మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేసుకోవడం.. ముఖ్యంగా గుండె పరీక్షల్లో లిపిడ్ ప్రొఫైల్ తరచూగా టెస్ట్ చేయించుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు. ఈ టెస్ట్ ద్వారా గుండె జబ్బులను సులువుగా గుర్తించవచ్చు.