Telangana: రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా..!
ఓ యువకుడు రోజూ బకెట్‌తో నీళ్లు తీసుకెళ్లి స్మశానంలోని సమాధులకు పోస్తున్నాడు. అసలు అతడు అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ యువకుడు మాత్రం ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీళ్లు తీసుకెళ్లి సమాధుల మధ్య పోస్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. విషయం పోలీసులకు చేరవేసారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి వెళ్లి చూసి షాకయ్యారు.
గంజాయికి బానిసైన ఓ యువకుడు ప్రతిసారీ గంజాయిని కొనడం కష్టంగా మారడంతో ఏకంగా తానే సొంతంగా పండించుకోవడం మొదలు పెట్టాడు. ఇంట్లో పెంచితే పోలీసులు, చుట్టుపక్కలవారికి అనుమానం వస్తుందని, ఎవరూ ఊహించని విధంగా స్మశానంలో గంజాయి సాగు మొదలు పెట్టాడు. అది కూడా సమాధుల మధ్య గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. ఈక్రమంలో రోజూ వాటికి నీళ్లు తీసుకెళ్లి పోస్తుండటంతో స్థానికులకు అనుమానం రానే వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామానికి చెందిన బాబ్జి గత కొద్ది నెలలుగా వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. అతను గత కొన్ని నెలలుగా గంజాయికి అలవాటు పడ్డాడు. అయితే ప్రతిసారి గంజాయి కొనుక్కోవడం బాబ్జీకి ఇబ్బందిగా మారిందట. దీంతో ఏకంగా ఆ మొక్కలనే పెంచాలని డిసైడ్ అయ్యాడు. గుట్టు చప్పుడు కాకుండా స్మశానంలో సమాధుల మధ్య మొక్కలని పెంచడం ప్రారంభించాడు.
మొక్కలను పెంచేందుకు రోజు నీరు తీసుకెళ్లి పోస్తూ ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులు స్మశానం వద్దకు వెళ్లి చూడగా సమాధుల మధ్య గంజాయి మొక్కలు పెంచడంతో అధికారులకు ఒక్కసారిగా కళ్లు బైర్లుగమ్మాయి. దీంతో యువకుడిని అదుపులోకి తీసుకొని లక్ష రూపాయల విలువైన గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలు ఎక్కడ నుండి వచ్చాయి అని అధికారులు యువకుడిని నిలదీయడంతో తాను కేవలం గంజాయి సేవించే అలవాటు ఉండటంతో మొక్కలను తెచ్చి నాటుకోవడం జరిగిందని.. అంతకుమించి తనకు ఏమీ తెలియదని పోలీసుల ముందు లబోదిబోమన్నాడు. మరో మారు గంజాయి సేవించినా.. గంజాయి లభించినా లక్ష రూపాయల జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా తప్పదని అధికారులు హెచ్చరించారు. యువకుడిని మిడ్జిల్ తహసిల్దార్ ముందు బైండోవర్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.