Telangana: హనీ ట్రాప్ అంటే ఏమిటో తెలుసా.. దీనిని ఎప్పుడు.. ఎందుకు ప్రయోగిస్తారంటే..
హనీ ట్రాప్ అనే పదం ఇటీవల కాలంలో చాలా విస్తృతంగా వినిపిస్తున్న పదం. సాధారణంగా సినిమాల్లో చూసుకున్నట్లయితే సమాజంలో పేరు, ప్రతిష్టలు, బాగా డబ్బులున్న వ్యక్తులకు ప్రభుత్వంలో చాలా మందితో..
హనీ ట్రాప్ అనే పదం ఇటీవల కాలంలో చాలా విస్తృతంగా వినిపిస్తున్న పదం. సాధారణంగా సినిమాల్లో చూసుకున్నట్లయితే సమాజంలో పేరు, ప్రతిష్టలు, బాగా డబ్బులున్న వ్యక్తులకు ప్రభుత్వంలో చాలా మందితో మంచి సంబంధాలు ఉంటాయి. అలాంటి వారిని నేరుగా అరెస్టు చేయడానికి, విచారించడానికి పోలీసులకు అవకాశం ఉండదు. అలాంటి సందర్భాల్లో బాగా పలుకుబడి ఉన్న ఆ వ్యక్తి నుంచి గుట్టు రాబట్టేందుకు, సమాచారాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ఒక పథకం వేస్తారు. ఒక అందమైన అమ్మాయిని బరిలోకి దించుతారు. ఆ అమ్మాయి ఆ పలుకుబడి ఉన్న వ్యక్తిని ఆకట్టుకుని దగ్గర అవుతుంది. అలా మెల్లగా కావల్సిన సమాచారాన్ని కనుకొన్ని పోలీసులకు చేర వేస్తారు. ఇది మనం సినిమాల్లో కన్పించే సన్నివేశాలు. ప్రధానంగా జేమ్స్‌బాండ్ సినిమాల్లో ఇలాంటి సీన్ కనిసిస్తుంది. హనీ ట్రాప్ అనే పదానికి అర్థం కూడా అదే. ఒక వ్యక్తితో రొమాంటిక్ లేదా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని హనీ ట్రాప్ అంటారు.
హనీట్రాప్ అనేది ఇటీవల కాలంలో వచ్చినది కాదు. చరిత్రను పరిశీలిస్తే మహిళల ద్వారా రహస్య సమాచారం రాబట్టడం అనేది పురాతన కాలం నుంచే వస్తోంది. గూఢచర్యానికి ఎలాంటి మహిళలను ఉపయోగించాలో అర్థశాస్త్రం చెబుతోంది. ఆటాపాటా బాగా తెలిసిన వారు, కళల్లో ఆరితేరిన వారిని గూఢచారులుగా పెట్టాలని ఆ పుస్తకంలో రాసి ఉంది. మౌర్యుల కాలంలో విషకన్యలను కూడా ఉపయోగించేవారని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచయుద్ధాలలోనూ రెండో ప్రపంచయుద్ధం సమయంలోనూ శత్రు దేశాల యుద్ధవ్యూహాలు తెలుసుకునేందుకు హనీ ట్రాప్ ఏజెంట్లను ఉపయోగించారు. అలా చేసిన వారిలో బెట్టీ ప్యాక్ అనే ఆమె ఒకరు. రెండో ప్రపంచయుద్ధం సమయంలో బ్రిటన్, అమెరికాలకు ఆమె గూఢచారిగా పని చేశారు. లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా రహస్య సమాచారాన్ని బెట్టీ సేకరించేవారని చరిత్ర చెబుతోంది.
సోవియట్ రష్యాలోనూ ఇంటెలిజెన్స్ సంస్థ కేజీబీ ‘హనీ ట్రాప్’ టెక్నిక్‌ను చాలా బాగా వాడేదని చరిత్ర చెప్తున్న విషయం. పశ్చిమ దేశాల దౌత్యవేత్తలు, నిఘా సంస్థలకు చెందిన అధికారులను లక్ష్యంగా చేసుకునేది ఈ సంస్థ. మొదటి ప్రపంచయుద్ధంలో మాటా హారీ అనే డచ్ డ్యాన్సర్ కూడా జర్మనీ కోసం గూఢచారిగా పని చేశారనే కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. ప్రముఖ ఫ్రెంచ్ రాజకీయ నాయకులు, అధికారులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ఆ దేశ రహస్య సమాచారాన్ని ఆమె సేకరించి జర్మనీకి పంపేవారు అనే ఆరోపణలు ఉన్నాయి. విచారణలో దోషిగా తేలడంతో 1917లో ఆమెకు మరణశిక్ష విధించారు.
హనీ ట్రాప్ అనేది ఇటీవల కాలంలో భారత్‌లో తరచూ వినిపిస్తున్న పదం. భారత సైనికులకు, అధికారులకు వలపుల వల విసిరి వారి నుంచి రహస్య సమాచారాన్ని రాబడుతున్నారనే వార్తలు ఇటీవల ఎక్కువుగా వింటున్నాం. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐ పన్నిన హనీ ట్రాప్‌లో పడి భారతదేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆ దేశానికి ఇచ్చారనే ఆరోపణలు ఇటీవల వినిపించాయి. తాజాగా డబ్బులున్న వారిని ట్రాప్ చేసి వారిని బెదిరించి వారి నుంచి ఆస్తులు, డబ్బులు దోచుకుంటున్న ఘటనలను చూస్తున్నాం. ఇలాంటివి కూడా హనీ ట్రాప్‌లో భాగమే. సామాజిక మాద్యమాల వినియోగం పెరిగిన తర్వాత వీటి వేదికగా హనీ ట్రాప్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇలా హనీ ట్రాప్‌కు పాల్పడే వాళ్లకు ఎక్కువగా అమ్మాయిల పేరుతో, ఫొటోలతో సోషల్ మీడియాలో ఖాతాలు తెరుస్తారు. ఆ తరువాత తామ టార్గెట్ చేసే వ్యక్తులను ఫాలో కావడం ప్రారంభిస్తారు. వారితో స్నేహం చేస్తూ, ప్రేమించినట్లు నటిస్తూ… లైంగిక ప్రలోభాలకు గురి చేస్తూ మోసం చేసేందుకు, రహస్య సమాచారం లాగేందుకు ప్రయత్నిస్తారు. కొంత కాలంగా భారత్‌లో ఇలాంటి హనీ ట్రాప్ కేసులు పెరుగుతున్నాయి. భారత సైన్యం, వైమానికదళంలో 2015 నుంచి 2017 మధ్య అయిదు కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో రాజ్యసభకు తెలిపింది. అందుకే హనీట్రాప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం