Telangana: ప్రశ్నార్థకంగా రైతుల పరిస్థితి.. వర్షాలు లేక, నీళ్లు రాక అల్లాడిపోతున్న కర్షకులు..
వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో రైతుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది.. వర్షాలు లేక.. నీళ్ళు రాకా.. వరిపంటవేసుకునే దారిలేక రైతులు అల్లాడిపోతున్నారు. గత రెండు నెలలుగా వర్షాలు కురవక పోవడంతో 30 వేల ఎకరాల వరిసాగు చతికిల బడింది. మరోవైపు తాగు నీటి అవసరాలకే నీటిని వాడుతోండడంతో..

వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో రైతుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది.. వర్షాలు లేక.. నీళ్ళు రాకా.. వరిపంటవేసుకునే దారిలేక రైతులు అల్లాడిపోతున్నారు. గత రెండు నెలలుగా వర్షాలు కురవక పోవడంతో 30 వేల ఎకరాల వరిసాగు చతికిల బడింది. మరోవైపు తాగు నీటి అవసరాలకే నీటిని వాడుతోండడంతో వరి నాట్లు వేసే పరిస్థితి కనుచూపు మేరలో లేదు..వరినాట్లు ఆలస్యం అవుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు ఇబ్బందులపై టీవీ9 తెలుగు ప్రత్యేక కథనం..
వైరా రిజర్వాయర్ నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 18.2 అడుగులు కాగా ప్రస్తుత రిజర్వాయర్ నీటిమట్టం 13 అడుగులకు చేరుకుంది. వైరా రిజర్వాయర్ ద్వారా ఆయకట్టు సుమారు 30 వేల ఎకరాలకు పైగా సాగు అవుతుంది.12 మండలాల్లో 80 గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి అవసరాలు తీరుస్తుంది. అయితే, సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే వైరా రిజర్వాయర్ కింద ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది.
రిజర్వాయర్ కింద 30 వేల ఎకరాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఇప్పటికే వరి నారు పోసి, వరి నాట్లు కూడా వేసే వారు. కానీ, ఈ యేడాది వర్షాల్లేక వరి రైతుల పరిస్థితి తారుమారయ్యింది. తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటుని అధికారులను వేడుకుంటున్నారు రైతులు. జూలై నెల సగం గడిచిపోయినా ఖమ్మం జిల్లాలో వరుణుడి జాడలేదు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఖరీఫ్ పంటకి నీళ్ళివ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వాపోతున్నారు రైతులు.




పాలేరు నుంచి నీటిని విడుదల చేస్తే వైరా రిజర్వాయర్ కు నీళ్ళు వస్తాయి. కానీ ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఓవైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు ప్రభుత్వం నిర్లక్ష్యం.. రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కనీసం కాల్వ మరమ్మత్తులు పనులు చేపట్టకపోవడం ఆందోళనకరంగా మారింది. కాల్వల్లో పూడిక, మట్టి, రాళ్ళు తీయలేదు. కాల్వలు.. మొక్కలు, మట్టితో నిండి పోయి వుంది. రివిట్‌మెంట్ సరిగా లేదు.. రిజర్వాయర్‌లో సిల్టు కూడా తీయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరా రిజర్వాయర్ నుంచి సాగు నీటిని వదిలి.. అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..