KTR: కలవాల్సింది రాజకీయపార్టీలు కాదు.. పాట్నా విపక్షాల భేటీపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Patna Opposition Meeting: పాట్నా విపక్షాల భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. కలవాల్సింది రాజకీయపార్టీలు కాదు.. ప్రజలను ఏకం చేసే అంశాన్ని బీఆర్‌ఎస్ నమ్ముతుందన్నారు మంత్రి కేటీఆర్. ఢిల్లీ వేదికగా కేటీఆర్ చేసిన కామెంట్స్ చర్చగా మారాయి.

తెలంగాణలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగిన విపక్షాల భేటీ ఆసక్తిగామారింది. అయితే.. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ పాట్నా విపక్షాల భేటీపై స్పందించారు. ఆ భేటీకి బీఆర్ఎస్ దూరంగా ఉందన్న ఆయన.. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే అన్నారు. ఏకం కావాల్సింది దేశంలోని పార్టీలు కాదు, ప్రజలంతా ఏకమయ్యేలా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్, బీజేపీ కారణంగానే దేశంలో ఇప్పటికీ తాగునీరు, విద్యుత్ సమస్య ఉందన్నారు కేటీఆర్. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరమని చెప్పుకొచ్చారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదని.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చాలా దూరంగా ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మేఘాలయాలో బీజేపీ, కాంగ్రెస్, ఎన్పీపీ పొత్తు పెట్టుకున్నాయన్నారు. కాగా, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన ఎలక్షన్స్‌లో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కైయ్యాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
దేశంలో అత్యంత బలహీనమైన ప్రధాని మోదీనేనని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ నుంచే దేశ రాజకీయాలు చేయాలా?.. దానిని బీఆర్ఎస్ మార్పు తీసుకురాబోతోందనన్నారు. హైదరాబాద్ కేంద్రంగా బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ చెప్పారు. ఇక్కడ్నుంచే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని అన్నారు. ఇక, కేంద్ర ప్రజావ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తామన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతుగా పార్లమెంటులో ఓటేస్తామన్నారు కేటీఆర్. ఈ క్రమంలోనే.. ఢిల్లీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు కేటీఆర్.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
