Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామాలయంలో పూజకు వెళ్లిన మహిళలను బయటికి పంపిన వీడీసీ.. అసలు విషయం తెలిస్తే షాక్!

కల్లు అమ్మకాలపై మొదలైన గొడవ గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా మారింది. సీతారాముల కళ్యాణ ఉత్సవాలకు వెళ్లిన మహిళలను వీడీసీ సభ్యులు ఆలయం నుంచి వెళ్లగొట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వివాదం మరింతగా ముదిరింది. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.

రామాలయంలో పూజకు వెళ్లిన మహిళలను బయటికి పంపిన వీడీసీ.. అసలు విషయం తెలిస్తే షాక్!
Tallarampur Sri Kodandarama Temple
Follow us
Diwakar P

| Edited By: Balaraju Goud

Updated on: Apr 07, 2025 | 4:45 PM

కల్లు అమ్మకాలపై మొదలైన గొడవ గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా మారింది. సీతారాముల కళ్యాణ ఉత్సవాలకు వెళ్లిన మహిళలను వీడీసీ సభ్యులు ఆలయం నుంచి వెళ్లగొట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వివాదం మరింతగా ముదిరింది. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.

గత కొన్ని నెలలుగా గ్రామాభివృద్ధి కమిటీ(VDC)కి, గౌడ సంఘం సభ్యులకు మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శనివారం(ఏప్రిల్ 5) కుంకుమ పూజను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పూజలో పాల్గొనేందుకు గ్రామానికి చెందిన అనేక మంది మహిళలు మంగళహారతులతో వెళ్లారు. గౌడ సంఘానికి చెందిన మహిళలు కూడా హాజరుకాగా, వారు వెళ్లిపోయేవరకూ పూజా కార్యక్రమం మొదలుపెట్టేదీ లేదని స్థానిక పురోహితుడి ద్వారా వీడీసీ సభ్యులు చెప్పించారు.

అయితే మహిళలు అలాగే కూర్చుండగా పూజను ఆరంభించలేదు. చేసేది లేక గౌడ సంఘం మహిళలు గుడి నుంచి వెనుదిరిగారు. గ్రామంలో ఆలయ నిర్మాణం నుంచి ప్రతి ఏటా శ్రీరామనవమికి ముందు నిర్వహించే కుంకుమ పూజలో తాము ఆనవాయితీగా పాల్గొంటున్నామని మహిళలు వెల్లడించారు. వీడీసీకి, గౌడ సంఘానికి మధ్య వివాదం ఉంటే తమను అందులోకి లాగి దేవుని సేవకు దూరం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అంతేకాదు వీడీసీ సభ్యులపై ఏర్గట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విచారణ జరిపిన పోలీసులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు.15 కుటుంబాలను బహిష్కరించినట్లు నిర్ధారించారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులను అరెస్ట్ చేసేందుకు ఏర్గట్ల చేరుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వీడీసీ సభ్యులపై పోలీసు కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఇంటికి ఒక్కరు చొప్పున పాదయాత్రగా వచ్చి ఏర్గట్ల పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామం ఈత, తాటి చెట్లకు పెట్టింది పేరు. కాగా, గ్రామస్తులు ఈత చెట్ల నుండి కల్లు గీస్తూ ఉపాధి పొందుతున్నారు. అయితే గ్రామంలో ఈత చెట్లకు బదులు తాటి చెట్ల కల్లు మాత్రమే గీయాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు హుకుం జారీ చేశారు. దీనికి గౌడ కులస్తులు నిరాకరించటంతో వివాదం మొదలైంది. గత ఆరు నెలలుగా గీత కార్మిక కుటుంబాలకు వీడీసీకి మధ్య పంచాయితీ నడుస్తుంది.

తమ పూర్వీకులు తాటి చెట్లు ఎక్కేవారని, ఇపుడున్న కార్మికులు తాటి చెట్లు ఎక్కి కల్లు గీయలేక పోతున్నారని గౌడ కులస్తుల వాదన. కానీ తమకు తాటి కల్లు మాత్రమే కావాలని వీడీసీ పట్టుపట్టింది. ఈత కల్లు వేయవద్దని ఒకవేళ ఈతకల్లు అమ్మితే జరిమానా విధిస్తామని తేల్చి చెప్పారు. అయినా గౌడ కులస్తులు పట్టించుకోకపోవడంతో వారిని సాంఘిక బహిష్కరణ చేశారు. ఎవరైనా గ్రామంలో కల్లు తాగితే వారికి కూడా జరిమానా విధిస్తామని వీడీసీ హెచ్చరించింది. ఇక అప్పటి నుంచి వీడీసీకి గీత కార్మిక కుటుంబాలకు మధ్య పెద్ద వివాదం నడుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..