Singareni: సింగరేణిలో గనుల ప్రైవేటీకరణపై పార్లమెంట్‌లో కీలక ప్రకటన.. కేంద్రం వివరణ ఇదే..
సింగరేణి సంస్థలోని పలు బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతుందంటూ వార్తలు వెలువడుతున్నాయి. సింగరేణి ప్రైవేటీకరణపై ఇప్పటికే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పలు విపక్ష పార్టీలు, సింగరేణి కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సింగరేణి సంస్థలోని పలు బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతుందంటూ వార్తలు వెలువడుతున్నాయి. సింగరేణి ప్రైవేటీకరణపై ఇప్పటికే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పలు విపక్ష పార్టీలు, సింగరేణి కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదే అంశాన్ని టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో సైతం పోరాటం నిర్వహించారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయంపై కేంద్రాన్ని ప్రశ్నించగా.. సింగరేణిలోని పలు గనులను వేలం వేయడంపై కేంద్రం పార్లమెంట్‌లో బుధవారం వివరణ ఇచ్చింది. సింగరేణి సంస్థలో కేంద్రం, తెలంగాణకు ఉమ్మడి ఓనర్‌షిప్ ఉందని కేంద బొగ్గు శాఖామంత్రి ప్రహ్లాట్ జోషి తెలిపారు. తెలంగాణ ఎంపీల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్థరహితమని వెల్లడించారు. బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జీరో అవర్లో లేవనెత్తగా.. సభలోనే కేంద్రమంత్రి ప్రకటన జారీ చేశారు. సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51% ఉన్నప్పుడు.. 49% వాటా కల్గిన కేంద్రం ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదంటూ వెల్లడించారు.
బొగ్గు గనుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్న వేలం ప్రక్రియపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని వెల్లడించారు. వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుపుతున్న రాష్ట్రాలకు సైతం ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. దీంతో అనేక రాష్ట్రాలు గనుల వేలానికి పూర్తిగా సహకరిస్తున్నాయంటూ వివరించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలు కానప్పటికీ చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా వేలం పద్ధతిని అందిపుచ్చుకున్నాయన్నారు. వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళ్తుందని తెలిపారు. బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారంటూ కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి