న్యూ ఇయర్ రోజు ఈ పనిచేస్తే వదిలేదే లేదు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకునేలా హైదరాబాద్ పోలీసులు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా నగర పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాబ్ సర్వీసులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు.

కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకునేందుకు హైదరాబాద్ వాసులు సిద్దమవుతున్నారు. డిసెంబర్ 31న అర్థరాత్రి వేడుకలు నిర్వహించుకునేందుకు ఎవరి ప్లాన్లు వాళ్లు వేసుకుంటున్నారు. తమ కుటుంబసభ్యులు లేదా ఫ్రెండ్స్‌తో జరుపుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు న్యూ ఇయర్ కోసం కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. డిసెంబర్ 31 వస్తేనే అర్థరాత్రి మందుబాబులు సందడి చేస్తారు. మద్యం తాగుతూ న్యూఇయర్‌కు వెల్‌కమ్ చెబుతారు. వైన్ షాపులు కిటకిటలాడనుండగా..పబ్బులు, బార్లు మందుబాబులతో నిండిపోయి కోలాహలంగా ఉండనున్నాయి.
క్యాబ్ రద్దు చేస్తే చర్యలు
న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. సొంత వెహికల్ లేనివారు లేదా మద్యం తాగినవారు క్యాబ్ లేదా ఆటోలను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో హఐదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వాట్సప్ నెంబర్
వాహనం నంబర్, సమయం/ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్‌షాట్‌ను హైదరాబాద్ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ 9490616555 కు పంపించాలని సూచించారు. వెంటనే పోలీస్ సిబ్బంది స్పందించి నిబంధనలు పాటించనివారిపై కేసులు నమోదు చేశారని సూచించారు. కాగా డిసెంబర్ 31న రద్దీ కారణంగా ఆన్‌లైన్ క్యాబ్ సర్వీస్ ఫ్లాట్‌ఫామ్స్ భారీగా ధరలను పెంచనున్నాయి. అలాగే రైడ్‌ల క్యాన్సిలేషన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీసులు ఈ కొత్త గైడ్ లైన్స్ జారీ చేశారు.
