AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs NED: చెమటోడ్చి గెలిచారు ఓకే.! సఫారీల అంతు చూడాలంటే.. తుస్సుమనోళ్లను తీసేయాల్సిందే

టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశను టీమిండియా నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో గెలిచి అజేయంగా ముగించింది. అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 193/6 పరుగులు చేయగా, నెదర్లాండ్స్ 176/7 పరుగులు చేసింది. శివమ్ దూబే మెరుపు అర్థశతకంతో ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో భారత్ నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి సూపర్ 8కు దూసుకెళ్లింది.

IND Vs NED: చెమటోడ్చి గెలిచారు ఓకే.! సఫారీల అంతు చూడాలంటే.. తుస్సుమనోళ్లను తీసేయాల్సిందే
Ind Vs Ned
Ravi Kiran
|

Updated on: Feb 19, 2026 | 9:04 AM

Share

2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై భారత్ 17 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా గ్రూప్ స్టేజ్‌లో ఒక్క ఓటమి కూడా లేకుండా సూపర్ 8 రౌండ్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా అనూహ్యంగా బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(34 పరుగులు) తిలక్ వర్మ (31 పరుగులు) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.

తిలక్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే మొదట్లో ఆచి తూచి ఆడి, ఆ తర్వాత గేర్ మార్చి నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 25 బంతుల్లోనే తన అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 31 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 66 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా కూడా సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

194 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ విజయం కోసం చివరి వరకు పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత బౌలింగ్ విభాగం ఈ మ్యాచ్‌ను ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌గా ఉపయోగించుకుంది. బౌలర్లను మార్చి మార్చి ఉపయోగించుకోవడం వల్ల మ్యాచ్ చివరి వరకు వెళ్ళింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా, శివమ్ దూబే రెండు వికెట్లు సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియాకు కొన్ని లోపాలు కనిపించాయి. ఓపెనర్లు ఇద్దరూ త్వరగా పెవిలియన్ చేరడం ఆందోళన కలిగించింది. అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టి జట్టులోకి తీసుకున్న వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ కూడా తీయకుండా నాలుగు ఓవర్లలో 36 పరుగులు ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా మూడు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు. శివమ్ దూబే రెండు వికెట్లు తీసినప్పటికీ, మూడు ఓవర్లలో 35 పరుగులతో 11.67 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సుమారు మూడు క్యాచ్‌లు కూడా డ్రాప్ అయ్యాయి. ఇలాంటి చిన్న జట్టుపైనే ఈ గణాంకాలు ఉంటే, సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి. టీమిండియా సూపర్ 8కు ముందు ఈ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు.

Follow Us