AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొఘలుల నుంచి మోదీ వరకు.. మనసులు గెలుస్తున్న ‘మామిడి’ దౌత్యం

మొఘలుల నుంచి మోదీ వరకు.. మనసులు గెలుస్తున్న ‘మామిడి’ దౌత్యం

Phani CH
|

Updated on: Jun 05, 2026 | 9:28 PM

Share

మామిడి పండు కేవలం వేసవి రుచికరమైన పండే కాదు.. దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచిన ‘స్వీట్ డిప్లొమాట్’ కూడా. మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి నేటి భారత్-అమెరికా, భారత్-పాకిస్తాన్, భారత్-బంగ్లాదేశ్ సంబంధాల వరకు మామిడి దౌత్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ నేతలను ఆకట్టుకున్న ఈ పండు ఎన్నో చారిత్రాత్మక బంధాలకు వారధిగా నిలిచింది.

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ గుర్తొచ్చేది ‘మామిడి పండు’. కేవలం సాధారణ ప్రజలనే కాకుండా ఎందరో ప్రముఖ కవులు, రచయితలు, తత్వవేత్తలను సైతం ఈ పండు మైమరపించింది. అమీర్ ఖుస్రో నుండి మిర్జా గాలిబ్, రవీంద్రనాథ్ ఠాగూర్ వరకు ఎందరో మహానుభావులు ఈ పండుపై నోరూరించే కీర్తనలు, కవితలు రాశారు. అయితే, మామిడి కేవలం ఒక పండు మాత్రమే కాదు.. అంతర్జాతీయ దౌత్య సంబంధాలను ముడిపెట్టే ఒక ‘స్వీట్ డిప్లొమాట్’. శతాబ్దాలుగా దేశాల మధ్య, రాజకీయ నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించడంలో మామిడి పండు పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. ప్రస్తుతం అమెరికాలో భారతీయ మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భారతదేశపు ప్రసిద్ధ ‘కేసర్’ మామిడి పండ్లు సియాటిల్‌లోని మార్కెట్లలోకి అడుగుపెట్టడమే ఆలస్యం.. క్షణాల్లో అమ్ముడైపోతున్నాయి. ప్రవాస భారతీయులతో పాటు అమెరికన్లు కూడా ఈ పండ్ల రుచికి ఫిదా అయిపోతూ సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు షేర్ చేస్తున్నారు. అయితే, అమెరికాతో మామిడికి ఉన్న ఈ బంధం వెనుక ఒక ఆసక్తికరమైన దౌత్య కథ ఉంది. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ భారతదేశ పర్యటనకు వచ్చారు. అధికారిక విందులో ఆయనకు ‘అల్ఫోన్సో’ మామిడి పండును వడ్డించారు. దాని రుచికి ముగ్ధుడైన బుష్, అప్పటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వైపు తిరిగి, “ఇది నిజంగా ఒక అద్భుతమైన పండు!” అని కొనియాడారు. ఈ ఒక్క ప్రశంస భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలనే మార్చేసింది. మరుసటి సంవత్సరమే అంటే 2007లో భారతీయ మామిడి పండ్లపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది. దీనికి ప్రతిగా, అమెరికాకు చెందిన ప్రసిద్ధ ‘హార్లీ డేవిడ్సన్’ బైక్‌ల దిగుమతికి భారత్‌కు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాతి కాలంలోనే భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మక పౌర అణు ఒప్పందం కుదిరింది. అధికార కేంద్రాలతో మామిడికి ఉన్న అనుబంధం మొఘల్ యుగం నాటి నుంచే బలంగా ఉంది. మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ తన ఆత్మకథ ‘బాబర్ నామా’లో హిందుస్థాన్‌లోని మామిడి పండే అన్నింటికన్నా అత్యుత్తమమైనదని ప్రశంసించాడు. పచ్చిగా ఉన్నప్పుడు అది అద్భుతమైన కూరగాయగా, పండినప్పుడు అమృతంలా ఉంటుందని రాశాడు. అతని మనవడైన జహంగీర్ తన ‘జహంగీర్ నామాలో . మామిడి పండుతో మరే పండునూ పోల్చలేమని పేర్కొన్నాడు. ఇక అక్బర్ చక్రవర్తి ఒక అడుగు ముందుకు వేసి, బీహార్‌లోని దర్భంగాలో లక్షకు పైగా మామిడి చెట్లతో ‘లఖీ బాగ్’ అనే భారీ తోటను నాటించాడు. మొఘల్ కాలంలోనే మామిడి ఒక దౌత్య సాధనంగా మారింది. ఔరంగజేబు తాను చక్రవర్తిగా ప్రకటించుకున్న తర్వాత, పర్షియా రాజు షా అబ్బాస్‌ను ప్రసన్నం చేసుకోవడానికి రుచికరమైన మామిడి పండ్లను బహుమతిగా పంపాడు. ఆ తర్వాత బాల్కన్ రాజు కూడా శాంతి ఒప్పందంలో భాగంగా ఔరంగజేబుకు 200 ఒంటెల నిండా డ్రై ఫ్రూట్స్, తమ వద్ద పండే మామిడి పండ్లను కానుకగా సమర్పించాడు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఈ సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. విదేశాల నుండి వచ్చే ప్రతినిధులకు ఆయన మామిడి పండ్లను బహుమతిగా ఇచ్చేవారు. 1950వ దశకంలో చైనా ప్రధాని జౌ ఎన్‌లాయ్, నెహ్రూకు మచ్చల జింక, అరుదైన కొంగను బహుమతిగా ఇవ్వగా.. అందుకు బదులుగా నెహ్రూ చైనాకు మన మామిడి మొక్కలను పంపారు. అలాగే 1955లో సోవియట్ యూనియన్ నాయకుడు నికితా క్రుష్చెవ్‌కు నెహ్రూ మామిడి పండ్లను రుచి చూపించడంతో ఆయన వాటికి పెద్ద అభిమానిగా మారిపోయారు. నెహ్రూ కేవలం మామిడి పండ్లను ఇవ్వడమే కాకుండా, ఆ పండును ముక్కలుగా కోసి, చెంచాతో ఎలా తినాలో విదేశీ ప్రముఖులకు మర్యాద పాఠాలు కూడా నేర్పించేవారట! భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల మధ్య సంబంధాలు ఎంత ఉద్రిక్తంగా ఉన్నా, మామిడి పండ్లు మాత్రం బంధాలను కలుపుతూనే ఉన్నాయి. 1981లో పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్, భారత ప్రధాని ఇందిరా గాంధీకి ‘అన్వర్ రటౌల్’ అనే రకం మామిడి పండ్లను పంపారు. అయితే ఆ రకం వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతానికి చెందినదని గుర్తు చేస్తూ, ఇందిరా గాంధీ తిరిగి ఆయనకు అదే రకం పండ్లను పంపి “అసలైన మా రటౌల్‌ను ఆస్వాదించండి” అని సందేశం పంపారు. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ కూడా ప్రధాని మోదీకి మామిడి పండ్లను పంపే సంప్రదాయాన్ని కొనసాగించారు. 2021లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. భారత ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, మమతా బెనర్జీలకు 2,600 కిలోల ప్రసిద్ధ ‘హరిభంగా’ మామిడి పండ్లను పంపారు. వ్యాక్సిన్ ఎగుమతుల నిలిపివేతపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్న సమయంలో ఈ ‘మామిడి దౌత్యం’ సంబంధాలను చక్కదిద్దింది. ప్రధాని మోదీ హసీనాకు లేఖ రాస్తూ.. “ఆ మామిడి పండ్లు మీ ప్రేమను, బంగ్లాదేశ్ ప్రేమను మోసుకొచ్చాయి” అని ప్రశంసించారు. ఇటీవల మహమ్మద్ యూనస్ కూడా ప్రధాని మోదీకి 100 కిలోల హరిభంగా మామిడి పండ్లను పంపి ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయ రాజకీయాల్లోనూ మామిడి తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2011లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ప్రధానులకు ప్రతి వేసవిలో స్వయంగా ఎంపిక చేసిన మామిడి పండ్లను పంపడం ఒక సంప్రదాయంగా పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో రాజకీయంగా ఎంత తీవ్రమైన వైరం ఉన్నప్పటికీ, ఆమె ఈ సంప్రదాయాన్ని విస్మరించలేదు. 2021లో బెంగాల్‌లో బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఎన్నికల పోరు ముగిసిన తర్వాత కూడా ఆమె ప్రధానికి మామిడి పండ్లను పంపారు. రాజకీయ వైరాన్ని, సిద్ధాంతపరమైన విభేదాలను పక్కన పెట్టి, కేవలం ఒక పండు ద్వారా మానవీయ బంధాలను కాపాడుకోవడం మామిడికే సాధ్యమైంది. అందుకే, ఈ సాధారణ మామిడి పండు కేవలం రుచిలోనే కాదు.. దౌత్యంలోనూ ‘రారాజే’!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీధికుక్క కోసం కొట్టుకుంటున్న రెండు దేశాలు

24 అంతస్తులు.. 2,200 పడకలు.. దేశంలోనే టాప్ సర్కారు హాస్పిటల్ రెడీ

ఆటోలో 15 మందా? పాతబస్తీలో డేంజర్ జర్నీ!

చదివింది పది.. చేసేది లింగ నిర్ధారణ

‘మేమంతా చనిపోతున్నాం..’ అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్‌..

Follow Us