AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సంక్షోభంలో విద్యుత్ రంగం.. అప్పుల ఊబిలో డిస్కామ్‌లు.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్..

తెలంగాణ విద్యుత్ రంగం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం అండగా నిలుస్తున్నా, రాష్ట్ర డిస్కంలు రూ. 47,000 కోట్ల మేర సింగరేణికి బకాయి పడ్డాయని ఆరోపించారు. లిక సదుపాయాల కొరత, విద్యుత్ కోతలు, ప్రజా సంక్షేమంపై దీని ప్రభావం ఉందని అన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు నిర్మాణాత్మక మార్పులు, బాధ్యతాయుత ప్రణాళిక అవసరమని సూచించారు.

Telangana: సంక్షోభంలో విద్యుత్ రంగం.. అప్పుల ఊబిలో డిస్కామ్‌లు.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్..
Kishan Reddy
Krishna S
|

Updated on: Dec 18, 2025 | 4:43 PM

Share

నేడు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అనేది ఒక ప్రాథమిక అవసరంగా మారింది. పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో తెలంగాణలో విద్యుత్ రంగం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు భారీ పథకాలతో అండగా నిలుస్తుంటే.. మరోవైపు రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. గత 11 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. సౌభాగ్య యోజన కింద రాష్ట్రంలోని 5.15 లక్షల గృహాలకు విద్యుత్ కనెక్షన్లు, ఉజాలా పథకం ద్వారా 28 లక్షల ఎల్‌ఈడీ బల్బులు, 3.14 లక్షల ట్యూబ్ లైట్ల పంపిణీ, పీఎం-కుసుమ్ పథకం ద్వారా రైతులకు 20 లక్షల సౌర పంపు సెట్ల కేటాయింపు, రామగుండంలో 1,600 మెగావాట్ల ప్లాంట్ వంటివి అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. అలాగే దేశంలోనే మొదటిసారిగా 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ఇక్కడే ఏర్పాటు చేశారన్న ఆయన.. ఎక్కడ విద్యుత్ ఉత్పత్తి అయినా గ్రిడ్ ద్వారా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే వెసులుబాటు ఉందని అన్నారు.

సంక్షోభంలో రాష్ట్ర డిస్కామ్‌లు

కేంద్రం ఇంతటి సహకారం అందిస్తున్నా, రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల పరిస్థితి దయనీయంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఈ రంగం తీవ్ర రుణభారంలో ఉందని చెప్పారు. విద్యుత్ సంస్థలు సింగరేణికి సుమారు రూ. 47,000 కోట్లు బకాయి పడ్డాయన్నారు. ‘‘బడ్జెట్‌లో కేటాయించిన రూ.21,000 కోట్లలో అధిక భాగం ఉచిత పథకాలకే పోవడంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి కుంటుపడింది. భవిష్యత్ డిమాండ్ 1 లక్ష మెగావాట్లకు చేరుతుందని అంచనా ఉన్నా, ప్రస్తుతం చిన్న వర్షం పడినా హైదరాబాద్ వంటి నగరాల్లో విద్యుత్ కోతలు తప్పడం లేదు’’ అని మండిపడ్డారు.

సింగరేణిపై ప్రభావం

డిస్కామ్‌లు సింగరేణికి చెల్లించాల్సిన రూ.47,000 కోట్ల బకాయిల వల్ల ఆ సంస్థ ఆర్థికంగా ఇబ్బంది పడుతోందని.. దీనివల్ల జిల్లా ఖనిజ నిధికి నిధులు అందడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఫలితంగా గనుల ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, ఉపాధి, మౌలిక సదుపాయాల వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ హబ్‌గా మార్చాలనే లక్ష్యం నెరవేరాలంటే నాణ్యమైన విద్యుత్ సరఫరా అత్యంత కీలకమని కిషన్ రెడ్డి అన్నారు. కేవలం కొత్త డిస్కామ్‌లను ఏర్పాటు చేసి అప్పులను బదిలీ చేయడం కాకుండా విద్యుత్ రంగంలో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.