AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అంశంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. కిషన్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్

ప్రధాని మోదీ కఠిన వైఖరి కారణంగా పాకిస్తాన్ ప్రపంచ బిచ్చగాడిగా దిగజారిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, కాశ్మీరీలు రికార్డు సంఖ్యలో ఓటు వేసి, భారత ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తున్నారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అగ్నివీర్, డిజిటల్ ఇండియాను ఎగతాళి చేశారని, ఆ రెండూ ఇప్పుడు రక్షణ, ఫిన్‌టెక్‌లో ప్రపంచానికే రోల్ మోడల్‌గా నిలిచాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అంశంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. కిషన్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
Revanth Reddy - Kishan Reddy
Balaraju Goud
|

Updated on: May 30, 2025 | 9:07 PM

Share

ఆపరేషన్ సింధూర్.. ఎందుకీ సీక్రెట్స్ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ యుద్ధానికి దారితీశాయి. పాకిస్తాన్‌తో యుద్ధంపై కొన్ని విషయాలను కేంద్రం దాచిపెట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ ప్రజలకు అర్థమయ్యేలా అన్నీ బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యుద్ధం విరమించి ప్రజల ఆత్మగౌరవం తాకట్టుపెట్టారని.. యుద్ధం అంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం కాదని బీజేపీపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది తెలంగాణ భారతీయ జనతా పార్టీ.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. రఫెల్ జెట్ల గురించి పాకిస్తానే మాట్లాడటం లేదు. కాంగ్రెస్ మాత్రం దురుద్దేశంతో వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను 23 నిమిషాల్లోనే ధ్వంసం చేసింది. దీనిని పాకిస్తాన్ ప్రధాని, పాక్ సైన్యం ధృవీకరించాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. భారతదేశం వీడియో ప్రూఫ్‌తో ప్రపంచవ్యాప్తంగా దాడిని ప్రదర్శించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. వాణిజ్యాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్‌ను దౌత్యపరంగా మూలన పెట్టింది. దేశం ఐక్యంగా నిలబడి ఉండగా, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అబద్ధాలను వ్యాప్తి చేసి మన సాయుధ దళాల విజయాన్ని ప్రశ్నించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

పహల్గాం ఉగ్రదాడికి బుద్ధి చెప్తూ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్. దాయాదిపై విజయానికి గుర్తుగా అంతర్జాతీయంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈ విషయంలో బీజేపీ తీరుపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. గురువారం నిర్వహించిన జై హింద్ ర్యాలీలో బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో వాస్తవాలు చెప్పడం లేదంటూ ఆరోపించారు. మన సైనికుల పోరాటంతో పాటు దేశాన్ని అవమానించే విధంగా రేవంత్ మాటలు ఉన్నాయని కేంద్ర కిషన్ రెడ్డి తప్పుబట్టారు.

సైనికులకు సెల్యూట్ చేయడానికి బదులుగా, ఎన్ని రాఫెల్‌లను కాల్చివేశారని అడగడం సిగ్గుచేటు అన్నారు. ఇది భారత సైన్యం నైతికతను దెబ్బతీస్తుందన్న కిషన్ రెడ్డి. వారి అజ్ఞానాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. ఢిల్లీ నుండి రాహుల్ చెప్పిన మాటలను రేవంత్ కాపీ చేస్తున్నాడన్న కిషన్ రెడ్డి, జాతీయ భద్రతను రాజకీయ అపహాస్యం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ నేత కుళ్లు రాజకీయాలు భారతదేశ దౌత్య లాభాలను, జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో పడేస్తాయన్నారు. మేము చప్పట్లు అడగమని, భారతదేశం విజయాల గురించి ఏడవడం ఆపండి అంటూ కిషన్ రెడ్డి హితబోధ పలికారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకున్నారనే వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న కేంద్ర మంత్రి, 1971 తర్వాత కాంగ్రెస్‌కు అవకాశం లభించింది. కానీ ఇప్పటికీ విఫలమైందన్నారు. 1971 యుద్ధం తర్వాత కాంగ్రెస్ 93,000 మంది పాకిస్తానీ యుద్ధ ఖైదీలను విడుదల చేసింది. కానీ పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయిందని విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్స్ నుండి వైమానిక దాడుల వరకు ఆపరేషన్ సిందూర్ వరకు, మోదీ ఏ కాంగ్రెస్ పాలనలోనూ లేని దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని కిషన్ రెడ్డి వెల్లడించారు. యుపిఎ పాలనలో, ఉగ్రవాదం అదుపు లేకుండా పోయిందన్న కిషన్ రెడ్డి, మోదీ పాలనలో, సైన్యానికి ప్రతీకారం తీర్చుకునే అధికారం లభించిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను అవమానిస్తోందన్నారు కిషన్ రెడ్డి. రేవంత్‌కు రాహుల్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం సరికాదన్నారు. గతంలో అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారన్నారు. రాహుల్ గాంధీని కలవడానికి రేవంత్ రెడ్డి 3 రోజులు వేచి ఉన్నాడని గుర్తు చేశారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పతనం ఖాయమన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కఠిన వైఖరి కారణంగా పాకిస్తాన్ ప్రపంచ బిచ్చగాడిగా దిగజారిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, కాశ్మీరీలు రికార్డు సంఖ్యలో ఓటు వేసి, భారత ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తున్నారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అగ్నివీర్, డిజిటల్ ఇండియాను ఎగతాళి చేశారని, ఆ రెండూ ఇప్పుడు రక్షణ, ఫిన్‌టెక్‌లో ప్రపంచానికే రోల్ మోడల్‌గా నిలిచాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, యుద్ధంలో ఏం జరిగిందో చెప్పడం లేదు. కానీ తిరంగా ర్యాలీతో రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రయత్నిస్తోందనేది కాంగ్రెస్ వాదన. అయితే తిరంగా ర్యాలీ అనేది రాజకీయ కార్యక్రమం కాదు. అది దేశానికి సంబంధించిన అంశమంటోంది బీజేపీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..