Telangana Thalli Statue: ఒకే రోజు ఒకే సమయానికి రెండు వేరు వేరు తెలంగాణ తల్లి విగ్రహాలు..!

డిసెంబర్ 9ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల ముగింపు సందర్భంగా సర్కార్ నేతృత్వంలో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగబోతోంది.

Telangana Thalli Statue: ఒకే రోజు ఒకే సమయానికి రెండు వేరు వేరు తెలంగాణ తల్లి విగ్రహాలు..!
Telangana Thalli Statue
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Balaraju Goud

Updated on: Dec 05, 2024 | 2:36 PM

డిసెంబర్ 9… తెలంగాణ రాజకీయాల్లో బిగ్‌డేగా నమోదు కాబోతోంది. సోనియా గాంధీ పుట్టినరోజును, ఏడాది ప్రజాపాలన సంబురాలకు ముగింపును ఒక్కటిగా చేర్చి.. హెవీవెయిట్ సెలబ్రేషన్స్‌కి మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంది రేవంత్ సర్కార్. డిసెంబర్ 9న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఈ సంబరాల్లో కీలకఘట్టం. కానీ.. ఇక్కడే మదర్ సెంటిమెంట్‌ని తెరమీదికి తీసుకొచ్చి.. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తుతోంది బీఆర్‌ఎస్ పార్టీ.

ఈ ఏడాది డిసెంబర్ 9ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల ముగింపు సందర్భంగా సర్కార్ నేతృత్వంలో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగబోతోంది. అయితే, తెలంగాణలో పోటాపోటీ విగ్రహాలకు వేదిక కానుంది. ఒకే నగరంలో.. ఒకే సమయంలో.. ఒకే రోజు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు వేరువేరు తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే… అదే సమయానికి మేడ్చల్ జిల్లా కార్యాలయంలో కేటీఆర్ పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునరావిష్కరించనున్నారు.

అసలు కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరిస్తున్న విగ్రహం సవతి తల్లిదని… అసలైన తెలంగాణ తల్లి విగ్రహం తమది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించే విధంగా రేవంత్ రెడ్డి కొత్త రూపంలో ఓ విగ్రహాన్ని తయారు చేశారని, పక్కనున్న తెలుగు తల్లి విగ్రహం నగలు, కిరీటంతో ఉంటే, తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికంలో కనబడాల అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు ఉన్న తెలంగాణ విగ్రహం హంగు ఆర్భాటాలతో, నగలు కిరీటాలతో, వడ్డానం పెట్టుకుని ఉండడాన్ని తప్పు పడుతున్నారు. ఈ విగ్రహం ఓ దొరసాని మాదిరిగా ఉందని సామాన్య తెలంగాణ మహిళను గుర్తుచేసేలా కొత్త తెలంగాణ విగ్రహాన్ని మేము రూపొందించమని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరిశీలించారు. పనుల జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పౌంటెయిన్‌ ఏర్పాటు పనులను కూడా పరిశీలించారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవిష్కరించనున్నారు సీఎం రేవంత్.

డిసెంబర్ 9న సచివాలయంలో సగటు సామాన్య మహిళను పోలిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇటు అదే సమయానికి బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ పార్టీ కార్యాలయంలో నగలు, వడ్డెనాలు, కిరీటాలతో కూడిన పాత విగ్రహాన్ని ఎనిమిది ఫీట్ల హైట్‌తో ఆవిష్కరించనున్నారు. ఓవైపు భరతమాత ఫోటో, ఒక రాష్ట్రం తెలుగు తల్లి విగ్రహం నగలు కిరీటాలతో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం పేదరికంలో చూపించడం తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించడమే అంటున్నారు.

తెలంగాణ తల్లి విగ్రహం 14 ఏళ్ల ఉద్యమ కాలంలో, 10 సంవత్సరాల ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఆమోదించిన విగ్రహం అని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా విగ్రహాన్ని తీసుకొచ్చి వివాదం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో వచ్చే రోజుల్లో ఇదే తరహా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతి చోటా ఆవిష్కరిస్తామంటున్నారు బిఆర్ఎస్ పార్టీ నేతలు.

తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. బంగారు అభరణాలు, వడ్డానాలు పెట్టి తెలంగాణ తల్లిని గతంలో దొరసానిలాగా.. కవితలాగా తయారు చేశారన్నారు. సబ్బండ వర్గాల ప్రతినిధిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశామన్నారు మంత్రి కొండా సురేఖ.

సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటయ్యే స్థలానికి ఆగస్టు 8న భూమిపూజ చేశారు సీఎం రేవంత్. విగ్రహం చుట్టూ అదనపు హంగులను కూడా ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. రాత్రి కాగానే లేజ‌ర్ లైట్ల వెలుగులు విరజిమ్మేలా విగ్రహం చుట్టూ పెద్ద ఫౌంటైన్‌ రాబోతోంది. ట్యాంక్ బండ్ పైకి, ఏన్టీఆర్ మార్గ్ లోకి వ‌చ్చే సంద‌ర్శకుల‌కు సైతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసేందుకు అనుమ‌తి ఇస్తారు. ఇదంతా అటుంచితే విగ్రహ నమూనాపై మొదలైన వివాదమే ఇప్పుడు హాట్‌టాపిక్..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..