Big News Big Debate: తెలంగాణలో ఎలక్షన్ వార్ ఇంకా ముగియలేదా?
తెలంగాణలో ఎన్నికలు ముగిశాక.. ఇక, అంతా కూల్ అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే, అసలు సిసలు పొలిటికల్ వేడి ఇప్పుడే రాజుకున్నట్టు కనిపిస్తోంది. కొత్త గవర్నమెంట్ కు కొంచెం టైమిస్తామన్న ప్రతిపక్ష బీఆర్‌ఎస్... అప్పుడే టీజింగ్ స్టార్ట్ చేసేసింది. సమయం లేదు సేనా.. ఇక రణమే అంటోంది. ఇంతకీ గులాబీదళం తీసుకున్న ఎటాకింగ్ స్ట్రాటజీ వెనక మతలబు ఏంటి?
తెలంగాణలో ఎన్నికలు ముగిసి.. కాంగ్రెస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో.. పొలిటికల్‌గా పార్టీలన్నీ కాసింత సేదతీరొచ్చనే అనుకున్నారంతా. అందుకు తగ్గట్టే.. కొత్త ప్రభుత్వానికి కొంత టైమ్ ఇస్తామంటూ ప్రధానప్రతిపక్షం బీఆర్‌ఎస్ కూడా చెప్పింది. కానీ, వాస్తవ పరిస్థితి అలా కనిపించడం లేదు. శ్వేతపత్రాలతో కవ్వించిన కొత్త ప్రభుత్వానికి అంతే ఘాటుగా స్వేదపత్రంతో కౌంటర్ ఇచ్చింది గులాబీ పార్టీ.
శ్వేతం,స్వేదం పత్రాలతో ఆగుతుందనుకున్న వార్.. ఇప్పుడు మరో స్థాయికి చేరింది. కాంగ్రెస్ 420 (ఫోర్ ట్వంటీ) హామీలు అంటూ.. ఒక బుక్‌లెట్‌నే రిలీజ్ చేసింది బీఆర్‌ఎస్. దీన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. అయితే, కొత్త సర్కార్‌కు కొంత సమయం ఇద్దామనుకున్న బీఆర్‌ఎస్ ఇంత దూకుడుగా వెళ్లడానికి ప్రధాన కారణం.. అతి త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలేనని తెలుస్తోంది. ఎంత వేచిచూద్దామన్నా… ఆ పరిస్థితి లేకపోవడం వల్లే గులాబీసేన.. ఇక రణమే అంటూ రంగంలోకి దిగింది. ఇప్పటికే పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు కూడా మొదలెట్టారు కేటీఆర్.
ఇక, అవినీతి విషయంలో బీఆర్‌ఎస్‌ను సైడ్ చేసేసి.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. కేసీఆర్ అవినీతిపై సీబీఐ విచారణ అంటూ ఎన్నికలకు ముందు చెప్పిన రేవంత్.. ఇప్పుడు మాటమార్చి న్యాయవిచారణ అంటున్నారనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి , ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. దమ్ముంటే సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలన్నారు. అయితే, దీనికి కాంగ్రెస్ నుంచి కూడా అదేస్థాయిలో కౌంటర్ వచ్చింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల అగ్గి.. పార్లమెంటు ఎన్నికలు, స్థానిక ఎన్నికలు అయిపోయేదాకా కూడా రాజుకుంటూనే ఉంటుందని ప్రస్తుత పరిస్థితిని చూస్తే స్పష్టమవుతోంది. మరి, ఈ పొలిటికల్ నిప్పులు ఎవరికి లాభం చేకూరుస్తాయో? ఎవరిని నష్టపరుస్తాయో? చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి