TS Police Final Merit List: తెలంగాణ పోలీస్ అభ్యర్ధులకు అలర్ట్.. జులై రెండో వారంలోనే ఎస్సై, కానిస్టేబుళ్ల తుది జాబితా వెల్లడి
ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియక తుది అంకానికి చేరుకుంది. వీటిల్లో తొలుత ఎస్సై పోస్టులకు ఎంపికైన వారి జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం.ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) కసరత్తు వేగవంతం..

హైదరాబాద్: ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. వీటిల్లో తొలుత ఎస్సై పోస్టులకు ఎంపికైన వారి జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం.ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) కసరత్తు వేగవంతం చేస్తోంది. మొత్తం 97,175 మంది అభ్యర్థులు ధ్రువీకరణపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. కటాఫ్ మార్కుల ఆధారంగా వీరిలో ఎంపికైన వారి తుది జాబితాను తయారు చేస్తారు.
ఎస్సై పోస్టుల ఎంపికకు మల్టీ జోన్లలోని పోస్టుల ఖాళీల ఆధారంగా జాబితా తయారు చేస్తారు. కానిస్టేబుళ్ల ఎంపిక జాబితా జిల్లాల్లోని ఖాళీల ఆధారంగా కటాఫ్ మార్కుల్ని నిర్ణయిస్తున్నారు. అలాగే రిజర్వేషన్, మహిళలు, పురుషులు, స్పెషల్ కేటగిరీలు.. ఇలా దాదాపు 180కిపైగా అంశాలను పరిగణనలోకి తీసుకొని కటాఫ్ మార్కుల్ని నిర్ణయిస్తారు. అందుకే తుది జాబితా ఎంపిక కూలంకషంగా తరచి చూస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. అంతా సవ్యంగా సాగితే జులై రెండో వారంలో తుది జాబితా వెలువడే అవకాశముంది.
వాటిల్లో తొలుత ఎస్సైలుగా ఎంపికైన 579 మంది జాబితా, ఏఎస్సైలుగా ఎంపికైన ఎనిమిది మంది జాబితాలను ప్రకటించనున్నారు. ధ్రువీకరణపత్రాల పరిశీలనకు హాజరైన 97,175 మందిలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు రెండింటికీ పరీక్షలు రాసినవారున్నారు.




తొలుత ఎస్సై విజేతల్ని ప్రకటిస్తే కానిస్టేబుల్ పోస్టును వదులుకుంటామని అండర్‌టేకింగ్ తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల కానిస్టేబుల్ పోస్టు స్థానంలో మరొకరు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. తుది ఎంపిక జాబితాలో పేరున్నా అపాయింట్‌మెంట్ లెటర్ వెంటనే అందుకోలేరు. జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి తాత్కాలిక, శాశ్వత చిరునామాల్లో వారి నేపథ్యంపై ఆరా తీసిన తర్వాత క్లీన్‌చిట్ లభిస్తేనే అపాయింట్‌మెంట్ లెటర్ అందుకుంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.