TRS Party: గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలు.. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శుల భేటీలో కేటీఆర్
టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో సమావేశం అయ్యారు.
KTR Meeting with TRS party General Secretaries: గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతం చేయడంతో పాటు కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. వీటితో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ, కార్యకర్తల జీవిత బీమా వంటి అంశాలపై చర్చించారు. ఇకపై ప్రజలకు మరింత చేరవయ్యేందుకు సోషల్ మీడియాలో దూకుడు పెంచాలని కేటీఆర్ సూచించారు. ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసుకుని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరింత యాక్టివ్ కావాలని నిర్ణయించింది గులాబీ పార్టీ.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను వేయాలని నిర్ణయించింది. బస్తీ, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం పని చేసిన వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు కేటీఆర్. ఇదే సమయంలో ప్రతి కార్యకర్త దగ్గరకు నేతలు వెళ్లేలా, అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందులోనూ యాక్టివ్‌గా ఉండాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక టీమ్‌లు పెట్టి ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సమాధానం ఇస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించింది.
తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS అధ్యక్షతన మొదలైన టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక సమావేశం. pic.twitter.com/iq4OZBfHZO
— TRS Party (@trspartyonline) July 14, 2021
మరోవైపు, ఈ ఏడాది మొదట్లో చేసిన సభ్యత్వ నమోదు 61 లక్షల చేరుకుందని, కార్యకర్తలందరికీ బీమాను మళ్లీ రెన్యువల్ చేయాలని నిర్ణయించారు. 48 లక్షల మంది సభ్యుల పేర్లు డిజిటలైజేషన్ జరిగిందని, మిగిలిన వాటిని ఈ నెలాఖరు పూర్తి చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు 31 జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణం, పనులు జరుగుతున్న తీరుపైనా చర్చించారు. 24 జిల్లాల్లో పూర్తయ్యాయని, ఏడు జిల్లాలో 95 శాతం జరిగాయని వివరించారు నేతలు. ప్రతి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని ప్రకటించారు. త్వరలో ఏర్పాటు చేసే కమిటీల్లోని నేతలకు నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది.
ఇదే సమయంలో నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పార్టీ నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఇదే క్రమంలో కృష్ణా జలాలపై హక్కులు లేని వాళ్లు కోర్టుకు వెళ్తున్నారని, లేని నీటి కోసం ఏపీ అక్రమాలు చేస్తోందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కడతాం.. నీటిని దొంగలిస్తామంటే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. నీటిపై తమ హక్కును కాపాడుకుంటామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.
61 లక్షల సభ్యత్వాలతో ఏ పార్టీకి దక్కని ఘనత టీఆర్ఎస్ సొంతమైంది – శ్రీ @PRRTRS, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి pic.twitter.com/IZPeoqRBQ1
— TRS Party (@trspartyonline) July 14, 2021
Read Also….