AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afidavit in High Court: కరోనాతో అనాథలుగా మారిన 177 మంది చిన్నారులు.. ఎన్నికల విధుల్లో పాల్గొన్న 19 మంది అధ్యాపకుల మ‌‌ృతి!

కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు, పరీక్షలు, ఫలితాలు, పడకల అందుబాటు, అత్యవసర మందులు, ఇతర అంశాలపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

Afidavit in High Court: కరోనాతో అనాథలుగా మారిన 177 మంది చిన్నారులు.. ఎన్నికల విధుల్లో పాల్గొన్న 19 మంది అధ్యాపకుల మ‌‌ృతి!
Telangana High Court
Balaraju Goud
|

Updated on: Jun 24, 2021 | 2:02 PM

Share

Telangana Govt.Afidavit in High Court: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 17 మంది ఉపాధ్యాయులు, జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల్లో ఇద్దరు కరోనా కారణంగా మృత్యువాతపడ్డారని విద్యాశాఖ పేర్కొంది. అయితే, పోలింగ్‌ విధుల్లో ఉండగానే వారికి కరోనా సోకిందన్న దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు.

తెలంగాణలో కోవిడ్ నియంత్రణ చర్యలపై విచారణ చేపట్టిన హైకోర్టు కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు, పరీక్షలు, ఫలితాలు, పడకల అందుబాటు, అత్యవసర మందులు, ఇతర అంశాలపై వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అత్యు్న్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పూర్తి అఫిడవిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది. కరోనా నియంత్రణ చర్యలతో పాటు ఇప్పటివరకు చేపడుతున్న కార్యక్రమాలను కోర్టుకు వివరించింది.

ఇటీవల నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికతో పాటు వరంగల్‌, ఖమ్మం తదితర ప్రాంతాల్లో మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. విధుల్లో 9,737 మంది ఉపాధ్యాయులు, 185 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. అందులో 487 మంది టీచర్లు, అయిదుగురు అధ్యాపకులు కరోనా బారిన పడ్డారు. చనిపోయిన 17 మంది ఉపాధ్యాయుల్లో ఏడుగురు ఎస్‌జీటీలు, ఎనిమిది మంది స్కూల్‌ అసిస్టెంట్లు, ఒకరు పీఈటీ, మరొకరు టీఆర్‌టీ ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలంగాణ విద్యా శాఖ హైకోర్టుకు వివరించింది. ఇందులో వరంగల్‌ గ్రామీణ జిల్లాకు చెందిన వారు అయిదుగురు, నల్గొండలో నలుగురు, జనగామ, ఖమ్మం జిల్లాల్లో ముగ్గురేసి, వరంగల్‌ అర్బన్‌లో ఇద్దరు చనిపోయారు. బాధిత కుటుంబ సభ్యులకు అందాల్సిన ప్రయోజనాలను యుద్ధ ప్రాతిపాదికన చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదిలావుంటే రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 177 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. వీరి సంక్షేమం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అనాథలుగా మారిన పిల్లలకు మూడేళ్లపాటు నెలకు రూ.2 వేలు అందిచనున్నట్లు తెలిపింది. తల్లిదండ్రుల పూర్వ వివరాలు తెలియని చిన్నారులకు బీసీ రిజర్వేషన్లు పొందేలా బీసీ ఏ ధ్రువీకరణ పత్రం ఇప్పించనున్నామన్నారు. పిల్లలందరికీ విద్యాసంస్థల్లో మూడుశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర పేర్కొంది. అత్యవసర సమయాల్లో రక్షణ కోసం పిల్లలకు సాధారణ ఫీచర్లతో కూడిన మొబైల్‌ ఫోన్లు అందించామని.. అందులో 1098, 100, సహాయ కేంద్రం, సీడబ్ల్యూసీ సభ్యులు, డీసీపీయూ అధికారుల నంబర్లు నమోదు చేశామని వెల్లడించింది. దీంతో ఆపద సమయాల్లో ఆయా చిన్నారులను రక్షించేందుకు వీలవుతుంది. కరోనాతో చనిపోయిన తల్లిదండ్రుల ఆస్తులపై హక్కుల కోసం బాధిత చిన్నారులకు న్యాయసహాయం అందించాలని న్యాయసేవా సంస్థను కోరామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

మరోవైపు, కరోనా సెకండ్ వేవ్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినవారిపై 10.34 లక్షల కేసులు నమోదు చేశామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మొత్తం రూ.41.27 కోట్లు జరిమానా విధించామని పేర్కొంది. నల్లబజార్‌లో కోవిడ్‌ మందులు, ఆక్సిజన్‌ వంటివాటిని అమ్ముతున్న వారిని గుర్తించి ఇప్పటి వరకూ 171 కేసులు నమోదు చేసినట్లు వివరించింది. ఇక, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈనెల 1 నుంచి 20 వరకు 14,62,050 మందికి హరేకృష్ణ ఫౌండేషన్‌ సహకారంతో అన్నపూర్ణ పథకం కింద ద్వారా ఉచిత భోజనం అందించామని ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు వివరించింది.

Read Also….  ఏపీలో టెన్త్, ఇంటర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ..జూలై చివరి వారంలో పరీక్షలు..?:AP Inter Exams 2021 video.