Maoist: అడవిలో అన్నలకు మరో ఎదురుదెబ్బ.. కరోనాతో మావోయిస్టు కీలక నేతలు మృతి.. ధృవీకరించిన మావోయిస్టు పార్టీ
Maoist Telangana Secretary Haribushan: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ మృతి చెందినట్లు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టులు) తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా

Maoist Telangana Secretary Haribushan: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ మృతి చెందినట్లు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టులు) తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా ధృవీకరించారు. అయితే జూన్ 21న హరిభూషణ్, 22న మాడ్ డివిజన్ ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సారక్క (భారతక్క)లు మృతి చెందినట్లు మావోయిస్టులు పార్టీ తెలిపింది. ఇద్దరు కూడా కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు హరిభూషణ్, సారక్క మృతిని నిర్ధారిస్తూ ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోషల్ మీడియాలో లేఖ విడుదలైంది.
అలాగే కొత్త గూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ కూడా ఈ విషయాన్ని ధృ వీకరించారు. కరోనాతో బాధపడుతూ చివరకు గుండెపోటుతో మరణించారని ఆయన వెల్లడించారు. మరి కొందరికి వైరస్ సోకిందని తెలిపారు. మావోయిస్టులు పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు. మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడుతామని ఆయన హామీ ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ హెచ్‌బీ అలియాస్ లక్మాదాదా ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం కలకలం రేగింది. అయితే తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించి సోమవారం రాత్రి మృతి చెందారనే వార్తలు సోషల్‌మీడియా వేదికగా వార్తలు గుప్పుమన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మీనగట్ట ప్రాంతంలో ఆయన మృతిచెందినట్లు దంతేవాడ పోలీసు ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారంటూ బస్తర్ ప్రాంతానికి చెందిన మీడియా సంస్థ ట్విటర్‌లో పేర్కొంది.
అయితే ఇటీవల అనారోగ్యంతో మావోయిస్టు అగ్రనేత కత్తి మోహన్ అలియాస్ ప్రకాశ్ మరణం మరువకముందే.. మరో కీలకనేత మృతి చెందడం దండకారణ్యంలో తీవ్ర కలకలం రేపుతోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరిభూషణ్ ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలోని మీనాగుట్ట ప్రాంతంలో మరణించాడన్న వార్త మంగళవారం ఛత్తీస్‌గఢ్- తెలంగాణలో దావానంలా వ్యాపించింది. ఆయన అంత్యక్రియలను తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో నిర్వహించారని తెలిసింది.
22న శ్రద్దాంజలి ఘటించాం..
వారి అంత్యక్రియలు ప్రజల మధ్యనే పూర్తి చేశామని, 22వ తేదీన వారి సంస్మరణ సభను జరిపి వారికి శ్రద్దాంజలి ఘటించామని మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొంది. హరిభూషణ్, భారతక్కలకుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా, యాప నారాయణ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామంలో ఆదివాసం కుటుంబంలో జన్మించారు. ఇంటర్మీడియేట్ వరకు నర్సంపేటలో చదివి, హన్మకొండలో డిగ్రీ పూర్తి చేశారు.

