Tiger Hulchul: ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం.. అడవి బిడ్డల తీవ్ర భయాందోళన
Telangana News: తెలంగాణలోని ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. జగ్గన్నపేట, పట్టిపల్లి పరిసర అడవుల్లో పులి సంచరిస్తున్న ఆనవాళ్లను గుర్తించారు.
తెలంగాణలోని ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. జగ్గన్నపేట, పట్టిపల్లి పరిసర అడవుల్లో పులి సంచరిస్తున్న ఆనవాళ్లను గుర్తించారు. మేతకు వెళ్లిన ఆవును పులి బలి తీసుకుంది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఎటు నుంచి వచ్చి..ఎప్పుడు తమపై దాడి చేస్తుందోనని హడలెత్తిపోతున్నారు. స్థానికులు పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పులి సంచారం ఆనవాళ్లు గుర్తించిన అటవీశాఖ సిబ్బంది.. దాన్ని పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్ద పులికి 40 కిలో మీటర్ల దూరం నడిచే సామర్థ్యం ఉంటుంది. అందుకే ఇప్పుడు పులి ఎక్కడ సంచరిస్తోందో గుర్తించడం అటవీశాఖ సిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది. పెద్దపులి అడుగుల ఆనవాళ్ల సాయంతో దాని సంచారం ఎటువైపు ఉందో గుర్తించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
స్థానికుల భయాందోళన..
పులి దాడి చేస్తుందేమోనన్న భయంతో స్థానిక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. భయంతో రోజువారీ కూలీ పనులు, వ్యవసాయ పనుల నిమిత్తం పంట చేలకు వెళ్లలేకపోతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. పశువులను మేతకు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా పులిని బంధించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
Also Read..