అడవి బాట పట్టిన ముగ్గురు ఐఏఎస్‌లు.. కాలి నడకన 5 కిలో మీటర్లు
ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఐ ఎ ఎస్ లు అడవి బాట పట్టారు..నిత్యం అధికారిక ,పాలన కార్యక్రమాల్లో బిజీగా ఉండే అధికారులు..ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా.. సాధారణ వ్యక్తుల్లా..దట్టమైన అడవి ప్రాంతంలో కాలినడకన గుట్టలు ఎక్కుతూ పులిగుండాల ప్రాజెక్టు కు చేరుకున్నారు..

అడవులను రక్షించుకోవాలి..నేచురల్ అందాలను ఆస్వాదిస్తూ..సహజమైన ప్రకృతి గాలిని పీల్చుకుంటూ ఆహ్లాదంగా గడపాలని జిల్లా కలెక్టరు అడవిలో తిరిగాడు. అటవీ ప్రాంతంలో సందర్శకులకు ఎలాంటి వసతులు ఉండాలి, అడవులను ఏవిధంగా సంరక్షించుకోవాలి, ECO ( ఎకో ) ప్రాజెక్ట్ తో అభివృద్ధి చేసి ఖమ్మం జిల్లా కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ను ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు ను ఎకో టూరిజం ప్రాంతంగా ఫిబ్రవరి నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. పెనుబల్లి మండల పరిధిలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ పులిగుండల ప్రాజెక్ట్ ను ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి పులి గుండాల ప్రాజెక్ట్ ను పరిశీలించారు.
సుమారు 5 కిలోమీటర్లు అడవి మార్గం గుండా కాలినడకన గుట్టల పైకి ఎక్కి పులిగుండాలను కలెక్టర్ సందర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఎకో టూరిజం ప్రణాళికలో భాగంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఫారెస్ట్ కమాండర్ జీపులో ప్రయాణించి పచ్చని సోయగం తో ఆహ్లాదకరంగా ఉన్న అటవీ ని చూసి టూరిజం ప్రాజెక్ట్ గా అభివృద్ధి చేసేందుకు ఆసక్తి చూపారు. అడవులను సంరక్షిస్తూ, ఆహ్లాదకరమైన పరిస్థితులు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ కోసం మొత్తం ఏరియాని పరిశీలించారు. పాలపిట్ట ఓరియల్ టవర్ ఎక్కి బైనాక్యులర్ ద్వారా చుట్టుపక్కల ఏరియల్ వ్యూ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ఎక్కువగా మనకు ప్రకృతి పరంగా అందమైన గుట్టలు, చెరువుల నుండి జాలువారే నీళ్ల తో అడవిని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసుకోవాలని, దీనివల్ల ఆర్యోగమనే సంపద వస్తుందని అన్నారు. రానున్న తరాలకు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీసుకొని వచ్చి ప్రకృతిని కాపాడుతూ, అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రకృతిని కాపాడుకోలేక మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, దానిని నివారించేందుకు అభివృద్ధి చేపట్టామన్నారు. పులిగుండల ప్రాజెక్టు లో ఆహాద్లం పంచే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసి సందర్శకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.
పర్యాటకుల కోసం చెరువులో బోటింగ్, వసతి కాటెజ్ లు, భోజనం, త్రాగునీరు వసతులను కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబంతో సందర్శించి ఆనందంగా గడిపేలా చర్యలు చేపడతామని, చెరువులో సంచరించే పక్షులు, పులిగుండాల చరిత్ర చెప్పే విధంగా వినూత్న కార్యక్రమాల నిర్వహణకు గైడ్ లు కూడా అందుబాటులో ఉంటారని అన్నారు. పిల్లలకు సైక్లింగ్, ఓపెన్ జిమ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ వంటివి అభివృద్ధి చేస్తూ…త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.