AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రోడ్డు పక్కన మిర్చి తోటలో ఆగి ఉన్న కారు.. తొంగి చూసేసరికి అంతా షాక్!

ఖమ్మం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన గుట్కా వ్యాపారిని కిడ్నాప్ చేసి హతమార్చారు దుండగులు. అనంతరం మృతదేహాన్ని కారుతో సహా మిర్చి తోటలో వదిలి పారిపోయారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.

Telangana: రోడ్డు పక్కన మిర్చి తోటలో ఆగి ఉన్న కారు.. తొంగి చూసేసరికి అంతా షాక్!
Reference Image
N Narayana Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Jan 25, 2025 | 5:52 PM

Share

హైదరాబాద్‌‌లో పాన్ మసాలా వ్యాపారం చేసే వ్యక్తి కనిపించకుండాపోయాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతన్ని కిడ్నాప్ చేసిన దుండగులు దారుణంగా హతమార్చి, రోడ్డుపక్క పొలాల్లో వదిలేసి వెళ్లిపోయారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లింగారం తండా సమీపంలోని జాతీయ రహదారి పక్కన మిర్చి తోటలో ఆ వ్యక్తి మృతదేహం బయటపడటం తీవ్ర కలకలం రేపింది.

హైదరాబాద్ బండ్లగూడ ప్రాంతానికి చెందిన బోల్లు రమేష్ గుట్కా వ్యాపారం చేస్తున్నాడు. డిస్ట్రిబ్యూటర్‌గా రెండు తెలుగు రాష్ట్రాలకు గుట్కా సప్లై చేస్తున్నాడు. రమేష్ తోపాటు వ్యాపారంలో సబ్ డీలర్‌గా సాజిత్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. వ్యాపారంలో లావాదేవీలు విషయంలో రమేష్ తో గొడవపడి విడిపోయాడు. సాజిత్ మరో నలుగురు వ్యక్తులతో కలసి వేర్వేరు వ్యాపారం మొదలుపెట్టాడు. ఎలాగైనా రమేష్ వ్యాపారాన్ని దెబ్బ తీయాలనుకున్న సాజిత్, వ్యాపారం నెపంతో నలుగురు వ్యక్తులను రమేష్‌కు పరిచయం చేశాడు.

అయితే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం జనవరి 18వ తేదీన రమేష్‌ను వ్యాపారం నిమిత్తం బయటకు వెళదామని చెప్పి కారులో ఎక్కించుకుని తీసుకువచ్చారు దుండగులు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు రాగానే రమేష్ కాళ్ళు, చేతులు తాడుతో కట్టేసి బెదిరించి, రమేష్ నుంచి 15 లక్షల రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేయించుకున్నారు. అనంతరం రమేష్‌ను వదిలేస్తే మళ్లీ వారిపై కేసు పెడతాడనే భయంతో దారుణానికి ఒడిగట్టారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గమధ్యలో కూసుమంచి మండలం లింగారం తండా వద్ద మిర్చి తోటలో తీసుకొచ్చి ఊపిరాడకుండా చేశారు. అప్పటికి రమేష్ చనిపోలేదనే అనుమానంతో బండరాయితో రమేష్ ను కొట్టి హత్య చేశారు.

రోజులు గడుస్తున్నా, రమేష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జనవరి 19వ తేదీన హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వ్యాపార భాగస్వామి సాజిత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, రమేష్‌ను హతమార్చినట్లు సాజిత్ ఒప్పుకున్నాడు. రమేష్‌ను హత్య చేసిన ప్రదేశం సాజిత్‌కు గుర్తు లేకపోవడంతో సెల్‌ఫోన్ ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. కూసుమంచి మండలం లింగారం తండా వద్ద సెల్‌ఫోన్ లొకేషన్ ద్వారా రమేష్ మృతదేహం లభ్యం అయింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..