సిగ్నల్ పాయింట్స్ వద్ద చలువ పందిళ్లు.. వాహనదారులకు కాసేపు ఉపశమనం..! ఎక్కడంటే..
భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరిగిపోతోంది. వేడిగాలులకు తోడు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక వాహన దారుల పరిస్థితి వర్ణనాతీతం. రోడ్డువెంట వెళుతుంటే నిప్పుల కొలిమినుంచి వెళుతున్న భావన కలుగుతోంది. ఆ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు వేసవి తాపాన్ని తట్టుకునేలా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఈ గ్రీన్ మ్యాట్ ను ఎక్కడ ఏర్పాటు చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

వేసవిలో రోడ్లపై ప్రయాణించాలంటే వాహన దారులకు వణికి పోతున్నారు.ముఖ్యంగా పట్టణాల్లో మండుటెండల్లో వాహనాలపై వచ్చి సిగ్నల్స్ వద్ద 30 సెకన్ల పాటు వాహనాలు ఆగుతుండటంతో ఆయా వాహనాదారులు ఎండ వేడిమి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరికొందరైతే వడదెబ్బకు గురవుతున్నారు. వేసవిలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారుల ఇబ్బందులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తించారు. సిగ్నల్ పాయింట్ల వద్ద నీడ కల్పించేందుకు కోమటిరెడ్డి సంకల్పించారు.
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నల్లగొండ పట్టణంలోని సిగ్నల్ పాయింట్ల వద్ద తాత్కాలిక గ్రీన్ మ్యాట్ ను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులు ఆదేశించారు. పట్టణంలో క్లాక్‌టవర్ సెంటర్, భాస్కర్ టాకీస్ సెంటర్, బస్టాండ్ ఏరియా, ఎనజీ కాలేజీ, సా గర్ రోడ్డు వంటి పాంత్రాల్లో 5సిగ్నల్స్ పాయింట్ల ఉన్నాయి.తొలుత ఎన్జీ కాలేజీ వద్ద అధికారులు తాత్కాలిక చలువ పందిళ్లు వేయించారు. ఈ సెంటర్ లో వేసిన గ్రీన్ మ్యాట్ తో వాహనదారులు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఒక్కో పందిరికి రూ.5 లక్షలు చొప్పున ఖర్చు వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయినా వాహన దారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిగిలిన సెంటర్లలో కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మునిసిపల్ అధికారులు పేర్కొంటున్నారు.
మంత్రి కోమటిరెడ్డికి ధన్యవాదాలు…
వేసవిలో రోడ్లపై ప్రయాణించే వాహన దారులకు కాసేపైన నీడ కల్పించాలన్న ఉద్దేశ్యంతో సిగ్నల్స్ పాయింట్ల వద్ద గ్రీన మ్యాట్ ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వాహనదారులు ధన్యవాదాలు చెబుతున్నారు. గతంలో ఇలాంటి మంచి పనులు ఏ నాయకులు, అధికారులు చేయలేదనీ అంటున్నారు. అయితే సిగ్నల్స్ వద్ద గ్రీన మ్యాట్ ఏర్పాటు చేయడం మంచిదే అయినప్పటికీ.. ఈదురు గాలులు వచ్చిన సమయాల్లో ఈ మ్యాట్ ఎగిరి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయనీ వాహనదారులు చెబుతున్నారు. అలా జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ వాహన దారులు సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




