Nagarjuna Sagar: ఆగని నీటి గలాట.. సాగర్ డ్యాం వద్ద భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద రెండో రోజు కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డ్యామ్‌కు ఇరవువైపులా ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా పోలీసులు భారీ సంఖ్యలో మొహరించారు. మొత్తం 26 గేట్లలో 13వ నంబర్ గేట్ వద్ద ఏపీ పోలీసులు కంచెను ఏర్పాటు చేశారు. కృష్ణా రివర్ వాటర్ బోర్డు నిబంధనల ప్రకారం 13వ నంబర్ గేటు వరకు తమ పరిధిలో ఉంటుందని చెబుతున్నారు.
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద రెండో రోజు కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డ్యామ్‌కు ఇరవువైపులా ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా పోలీసులు భారీ సంఖ్యలో మొహరించారు. మొత్తం 26 గేట్లలో 13వ నంబర్ గేట్ వద్ద ఏపీ పోలీసులు కంచెను ఏర్పాటు చేశారు. కృష్ణా రివర్ వాటర్ బోర్డు నిబంధనల ప్రకారం 13వ నంబర్ గేటు వరకు తమ పరిధిలో ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. అందుకే ఈ పరిధి వరకు కంచె ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇలా అడ్డంగా వేసిన కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు ఈరోజు ఉదయం ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. నిన్న తెల్లవారి మొదలైన ఈ ఉద్రిక్త పరిస్థితి ఈరోజు కూడా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కంట్రోల్ రూంను ఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారులు తమ స్వాధీనంలోకి తీసుకొని పర్యవేక్షిస్తున్నారు. నిన్న 500 మంది పోలీసు సిబ్బంది ఉన్నప్పటికీ ఈరోజు 1500 మంది పోలీసు బలగాలు మొహరించారు. నిన్న తెలంగాణలో పోలింగ్ కారణంగా ఎలక్షన్ విధులకు హాజరైన పోలీసులు ఈరోజు ఉదయం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుంటున్నారు.
మొన్నటి వరకూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో మాటలయుద్ధం. పోల్ దంగల్ ఇలా మొదలైందో లేదో అలా నీళ్లలో నిప్పు రాజుకుంది. నాగార్జున సాగర్ కుడికాలువ వద్ద మళ్లీ లొల్లి మొదలైంది. వందల మంది ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ వద్దకు చేరుకొని 13 గేట్లను స్వాధీనం చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో సాగర్ కుడి కాలువ నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు. ఇది నిబంధనల ఉల్లంఘన అని తెలంగాణ వాదిస్తుంటే .. విభజన హక్కుల ప్రకారం 13వ గేట్ తమ పరిధిలోకి వస్తుంటోంది ఏపీ.
నాగార్జున సాగర్ దగ్గర హై టెన్షన్‌పై స్పందించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఏపీ సర్కార్‌ది దుందుడుకు చర్య అని ఖండించారాయన. సాగర్ దగ్గర గలాటా ముమ్మాటికీ శాంతిభద్రతల సమస్య అన్నారాయన. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు కిషన్ రెడ్డి. సమస్యలేమైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఆంధ్ర, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం దురదృష్టకరమన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి. రాఘవులు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..