Telangana Politics: తెలంగాణలో డీలిమిటేషన్ సెగలు.. కాంగ్రెస్ వ్యూహంపై బీఆర్ఎస్, బీజేపీ రియాక్షన్ ఇదే..
డీలిమిటేషన్ అంశం.. తమిళనాడులోనే కాదు.. తెలంగాణలోనూ సెగలు పుట్టిస్తుంది. అఖిలపక్షంలో చర్చిద్దామని.. కాంగ్రెస్ అంటుంది. తమిళ రాజకీయ ట్రాప్‌లో పడ్డారని.. కమలం పార్టీ కస్సుబుస్సులాడుతున్న వేళ.. అసలు అఖిలపక్షం జరిగేదెప్పుడు.. వెళ్లేది ఎవరు?. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి..? అనేది కథనంలో తెలుసుకోండి..

డీలిమిటేషన్‌పై దక్షిణాది జంగ్ సైరన్ మోగిస్తున్న వేళ.. తెలంగాణకు కూడా ఈ సెగలు తాకాయి. డీలిమిటేషన్ పై అఖిలపక్షం నిర్వహిస్తామని అధికార కాంగ్రెస్ అంటుంది. 22న స్టాలిన్ భేటీ కంటే ముందే తెలంగాణలో అఖిలపక్ష భేటీ ఉంటుందన్నారు సీఎం రేవంత్. కానీ.. మీటింగ్ ఎప్పుడు ఉంటుందో ప్రకటించలేదు. అయితే.. కాంగ్రెస్ నిర్వహించే అఖిలపక్ష భేటీకి తాము దూరంగా ఉంటామన్నాయి బీఆర్ఎస్, బీజేపీ. అంతేకాదు సర్కార్‌పైనే రివర్స్ ఎటాక్ చేస్తున్నాయి. తమిళ రాజకీయ ట్రాప్‌లో పడ్డారని విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఆరు గ్యారెంటీలపై నిర్వహించండి: బీజేపీ
డీలిమిటేషన్ అనేది అసలు చర్చించే అంశమే కాదు.. అఖిలపక్షం పేరుతో అనవసర రాద్ధాంతం ఎందుకని ప్రశ్నిస్తోంది కమలం పార్టీ. 2026 తర్వాత పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత.. అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని బీజేపీ చెప్తుంది. కేంద్రంపై డీఎంకే విష ప్రచారం చేస్తుంటే.. దానికి కాంగ్రెస్ జత అయ్యిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్.
లేని అంశంపై అఖిలపక్ష సమావేశం ఎందుకు అని ప్రశ్నించారు ఎంపీ లక్ష్మణ్. ముందు ఆరు గ్యారంటీలపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలపై అఖిలపక్షానికి బీఆర్‌ఎస్ కూడా డిమాండ్ చేయాలన్నారు లక్ష్మణ్.
ఇటీవల కూడా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాబట్టడం కోసం అఖిలపక్షం నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ.. రకరకాల రాజకీయ, రాజకీయేతర కారణాలు చూపుతూ రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ ఆల్ పార్టీ మీటింగ్‌కు డుమ్మా కొట్టాయి. ఇప్పుడు కూడా అఖిలపక్షానికి వెళ్లేది లేదని తెగేసి చెప్పాయి. మొన్నటి ఆల్ పార్టీ మీటింగ్‌కు మజ్లిస్ నుంచి అసదుద్దీన్ తప్పిస్తే.. విపక్ష ఎంపీ ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో.. మళ్లీ మరో అఖిలపక్షానికి రెడీ అయింది కాంగ్రెస్. మరి ఈ సమావేశానికి ఎవరు హాజరవుతారు, ఎప్పుడు నిర్వహిస్తారన్నది.. హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..