Ethanol Plant at Narayanpet: నారాయణ పేటలో ఉద్రిక్తత.. పోలీసులపై తిరబడ్డ చిత్తనూరు రైతులు
ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా నారయణపేట జిల్లా మరికల్ మండల చిత్తనూరు రైతుల ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీసాయి. వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్లను కంపెనీ వద్ద రైతులు అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో ట్యాంకర్లను తరలిస్తుండగా రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొదట వాగ్వివాదం జరగ్గా అది కాస్తా లాఠీ ఛార్జ్ కు దారీ తీసింది..

నారాయణపేట, అక్టోబర్ 23: ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా నారయణపేట జిల్లా మరికల్ మండల చిత్తనూరు రైతుల ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీసాయి. వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్లను కంపెనీ వద్ద రైతులు అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో ట్యాంకర్లను తరలిస్తుండగా రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొదట వాగ్వివాదం జరగ్గా అది కాస్తా లాఠీ ఛార్జ్ కు దారీ తీసింది.
వాతావరణ కాలుష్యాన్ని కలిగించే ఈ కంపెనీ మాకు వద్దు అంటూ గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నరు మరికల్ మండల చిత్తనూరుతో సహా చుట్టూ గ్రామస్తులు. అయితే గత కొన్నిరోజులుగా ఇథనాల్ వ్యర్థాల అంశం అక్కడి స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. శనివారం రాత్రి కంపెనీ నుండి వ్యర్థ పదార్థాలను ట్యాంకర్ లో తరలిస్తుండగా ఎక్లాస్పూర్, చిత్తనూరు, జిన్నారం, కన్మనూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. రాత్రి నుండి ఉదయం వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు.
ఉద్రిక్తతలకు కారణం ఎవరు..?
ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ట్యాంకర్లను వదిలి పెట్టించి రైతులకు ఆగ్రహం తెప్పించేలా చేశారు. దీంతో పోలీసులపైకి స్థానికులు, రైతులు తిరగబడ్డారు. కంట్రోల్ తప్పిన పోలీసులు లాఠీ ఛార్జ్ మొదలెట్టారు. ప్రతిఘటిస్తూ పోలీసులపైకి రాళ్లు రువ్వారు గ్రామాస్థులు, రైతులు. ఇక పోలీసుల లాఠీఛార్జ్ తో కట్టలు తెంచుకున్న ఆగ్రహం వాహనాల ధ్వంసంకు దారీ తీసింది. పోలీస్ శాఖ కు చెందిన వజ్ర వాహనం, బైక్ లకు నిప్పంటించడంతో అవి బూడిదగా మారాయి. మరికొన్ని వాహనాలను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఘటనలో మక్తల్ సీఐ రామ్ లాల్ తో పాటు మరో ఐదుగురు పోలీసులు తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది పోలీసులను ఓ నివాసంలో నిర్భందించారు ఆందోళనకారులు. భారీగా పోలీసులు చేరుకొని వారిని విడిపించారు. అటూ పోలీసుల లాఠీఛార్జ్ లో పలువురు స్థానికులు, రైతులకు గాయాలయ్యాయి.
ప్రస్తుత పరిస్థితి..
ఘటన తర్వాత చిత్తనూరు గ్రామాన్ని జల్లెడ పట్టారు పోలీసులు. గ్రామానికి వచ్చి పోయే వారిని తనిఖీలు చేశారు. ఇథనాల్ కంపెనీకి వ్యతరేకంగా పోరాటం చేస్తున్న వారిని వెతికి వెతికి మరి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అసలు రైతుల ఆందోళనకు కారణం..
రెండెళ్ల క్రితం ఎక్లాస్పూర్ గేట్ సమీపంలో జూరాల ఆగ్రో ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అయితే మొదట జరిగిన గ్రామసభ నుంచి కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కంపెనీ ఏర్పాటు తర్వాత సైతం ఈ ఆందోళనలు కొనసాగుతూనే వచ్చాయి. ఇటివల ఇథనాల్ వ్యర్థాలను చిత్తనూరు గ్రామానికి సమీపంలోని వాగులు, ఖాళీ స్థలాలో పారబోస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటి వల్ల చెరువుల్లోని నీరు, పంటపొలాలు కలుషితం అవుతున్నాయని చెబుతున్నారు.
కంపెనీ ఏర్పాటును ఆది నుంచి వ్యతిరేకించిన గ్రామస్థులు, రైతులు… తాజాగా వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు పారబోయడంపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనినీ తమ గ్రామం నుంచి తరలించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




