
హైదరాబాద్, డిసెంబర్ 31: గడ్డ కట్టే చలికి తెలంగాణ రాష్ట్ర గజగజ వణికిపోతుంది. గత మూడు వారాలుగా కొనసాగుతున్న తీవ్ర చలితో జనాలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. మేఘాలు లేకపోవడం, హిమాలయాల నుంచి చల్లని గాలులు రావడమే దీనికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఇక రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట,వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
డిసెంబర్ నెలలో చాలా రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి (winter chills Hyderabad). స్పష్టమైన ఆకాశం, ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావం, రాత్రిపూట రేడియేషన్ శీతలీకరణ కారణంగా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ పరిశీలకులు చెబుతున్నారు. హైదరాబాద్ వెలుపల, ఉత్తర, మధ్య తెలంగాణలో కూడా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. కేబీ ఆసిఫాబాద్‌లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత (5.6 డిగ్రీల సెంటీగ్రేడ్) నమోదైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.