Telangana: రాజకీయ తుపాను సృష్టిస్తున్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు.. ‘క్లౌడ్ బరస్ట్’పై ఎవరు ఏమన్నారంటే..
గోదావరి వరదల వెనక కుట్ర ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమయ్యాయి. క్లౌడ్ బరస్ట్‌పై సీఎం కేసీఆర్ వ్యక్తంచేసిన అనుమానాలుపై ఓ వైపు సీరియస్ చర్చ జరుగుతోంది.
గోదావరి వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్(Telangana CM KCR) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ తుపాను రేపాయి. గోదావరి వరదల వెనక కుట్ర ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమయ్యాయి. క్లౌడ్ బరస్ట్‌పై సీఎం కేసీఆర్ వ్యక్తంచేసిన అనుమానాలుపై ఓ వైపు సీరియస్ చర్చ జరుగుతోంది. క్లౌడ్ బరస్ట్ సాధ్యసాధ్యాలు, గతంలో ఎక్కడైనా ఇలాంటిది జరిగిందా? అన్న చర్చ నడుస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై పొలిటికల్ రియాక్షన్స్ దూసుకొస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ నాయకులు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏదో రూపంలో స్పందించాల్సిన పరిస్థితి తలెత్తింది. కొందరు అవునా అంటూ సమాధానమిస్తుండగా.. ఇంకొందరు కేసీఆర్ వ్యాఖ్యలు వినలేదంటూ తప్పించుకుంటున్నారు.
తెలంగాణలో మాత్రం క్లౌడ్ బరస్ట్ పై పొలిటికల్ క్లౌడ్స్ క్యుమిలోనింబస్‌ను మించి కమ్మేశాయి. క్లౌడ్ బరస్ట్ చేసింది పాకిస్తానా? చైనానా సీఎం చెబితే బాగుంటుందని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. క్లౌడ్ బరస్ట్ చేయాలంటే ఎయిర్ బేస్ ఉండాలని.. గజ్వేల్‌లో సీక్రెట్గా ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు కొండా. లద్దాక్‌లో క్లౌడ్ బరస్ట్ సాధ్యమేనని.. అయితే అక్కడ జరిగిందో లేదో తనకు తెలియదన్నారు. అటు కేసీఆర్ వ్యాఖ్యలను కొట్టిపారేయకుండా.. దీనికి ఆధారాలు ఉంటే కేంద్రానికి ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. కేసీఆర్ తగిన ఆధారాలు ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపిస్తుందన్నారు.
కావున, ఈ ఆందోళన కలిగించే తీవ్రమైన విషయంపై కేసీఆర్ గారి వద్దనున్న అన్ని ఆధారాలను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి అందించినట్లయితే, భారత ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని తెలియజేస్తున్నాను.
— G Kishan Reddy (@kishanreddybjp) July 18, 2022
క్లౌడ్ బరస్ట్ అంటే గంటలో 10 సెంటీమీటర్ల వర్షపాతం పడుతుందని.. రోజల తరబడి వర్షాలు ఉండవన్నారు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మాజీ వైస్ ఛైర్మన్, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. ఉత్తరాఖండ్‌లో కూడా క్లౌడ్ బరస్ట్ జరగలేదంటున్నారు మర్రి. కేసీఆర్ డైవర్ట్ రాజకీయాలు చేయగలరని మరోసారి నిరూపించారని మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు.
అటు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రొ.కోదండరామ్ కూడా రియాక్ట్ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో వరదలను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని క్లౌడ్ బరస్ట్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశీ శక్తుల హస్తముందని సీఎం కేసీఆర్ పేర్కొనడం అవివేకమన్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే కాళేశ్వరం (Kaleshwaram) పంపింగ్ హౌస్ మోటార్లు మునిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన అంచనాలు లేకుండా ప్రాజెక్టును కట్టడమే అందుకు కారణమని వివరించారు. ఈ అంశంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వరద పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటో కానీ.. విపక్షాలు, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మాత్రం రెండు వర్గాలుగా మారిపోయి పరస్పర మాటలయుద్ధానికి దిగుతున్నారు. కౌంటర్లు.. ఎన్‌కౌంటర్లతో పొలిటికల్ క్లౌడ్స్ అందరిలో ఆవహించాయి.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి