AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Minister: ఏపీ అక్రమ ప్రాజెక్టులు సహా కాంగ్రెస్, బీజేపీ నేతలపై ఫైర్ అయిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..

Telangana Minister: ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీరుపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో...

Telangana Minister: ఏపీ అక్రమ ప్రాజెక్టులు సహా కాంగ్రెస్, బీజేపీ నేతలపై ఫైర్ అయిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..
Minister Vemula
Shiva Prajapati
|

Updated on: Jun 24, 2021 | 5:21 PM

Share

Telangana Minister: ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీరుపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల తరలింపుపై సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం కృష్ణా నది నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లను తీసుకుపోతుందని ఆరోపించారు. రోజుకు 7 టీఎంసీల నీళ్లు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ చేస్తున్న పనులు పూర్తి అయితే సాగర్ ఎడమ కాలువకు నీళ్లు రావని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుపై కేంద్రానికి- గ్రీన్ ట్రిబ్యునల్ కు కేసీఆర్ ఫిర్యాదు చేశారని మంత్రి చెప్పారు. కేంద్రం- ట్రిబ్యునల్ ఏపీ కడుతున్న ప్రాజెక్టుకు స్టే ఇచ్చిందన్నారు.

అయితే, ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని బేఖాతరు చేసిందని మంత్రి వేముల మండిపడ్డారు. ట్రిబ్యునల్‌కు అబద్ధాలు చెబుతూ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతోంది కాబట్టే ఆ ప్రాజెక్టులను ఆపాలని కృష్ణా బోర్డు ఆదేశాలు జారీ చేసిందని మంత్రి వేముల పేర్కొన్నారు. కృష్ణాబోర్డు ఆదేశాల ప్రకారం కృష్ణా బేసిన్‌పై అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను ఆపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గతేడాది పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయగా.. తెలంగాణ ప్రభుత్వం దానిని వ్యతిరేకించిందని, ఆ మేరకు లేఖ కూడా రాశామని మంత్రి చెప్పుకొచ్చారు. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపాలని కృ‌ష్ణాబోర్డుకు – కేంద్రానికి ఏడు లేఖలు రాశామని వెల్లడించారు.

ఇదిలాఉండగా.. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోతిరెడ్డిపాడు అంశంపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. ఒక టీఎంసీ నీళ్లు పోయే కాలువను నాలుగు టీఎంసీల నీళ్లు పోయేలా అప్పటి సీఎం వైఎస్సార్ పెంచారని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 4 టీఎంసీ నీళ్లను తీసుకుపోతుంటే డీకే అరుణ హారతి పట్టారని, పొన్నాల లక్ష్మయ్య కొబ్బర్రికాయ కొట్టారని దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడు అంశంపై ఆనాడు టీఆరెస్ మంత్రులు రాజీనామా చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు.

తెలంగాణకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం- మల్లన్న సాగర్ పై 300 కేసులు వేసిన కాంగ్రెస్ నేతలు.. ఏపీ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులపై కోర్టుకు ఎందుకు పోలేదని మంత్రి వేముల ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ కోసం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడితే.. తెలంగాణ కోసం బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేంద్రం ఆదేశాలు పాటించకుండా ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే కేంద్రం- తెలంగాణ బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని మంత్రి నిలదీశారు. వైఎస్సార్‌కు – తనకు వ్యక్తిగతంగా విబేధాలు లేవంటూ.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్ రాజశేఖరరెడ్డి బద్ధ వ్యతిరేకి అవునా? కాదా? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న వైఎస్సార్ తెలంగాణ ప్రజలకు దేవుడు ఎలా అవుతారు? అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు.

Also read:

Guinness World Records: గిన్నిస్ బుక్ ఎక్కిన అతిపెద్ద మ్యాజిక్ క్యూబ్..ఎక్కడ ఎలా తయారు చేశారో తెలుసా?

Video Goes Viral: సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి చెంప పగలగొట్టిన లోకల్ ఎస్పీ.. ఆ వెంటనే అతను ఏం చేశాడో తెలుసా…

Mustard Crop: రైతులకు లాభాలను పండిస్తున్న ఆవాల పంట.. ప్రభుత్వం విత్తనాల కొరత లేకుండా చూడాలంటున్న అన్నదాత