Telangana: ఈటల రాజేందర్ అహంతో మాట్లాడుతున్నారు.. మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం
Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ అహంతో మాట్లాడుతున్నారంటూ తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఈటలను టీఆర్ఎస్ నుంచి ఎవరూ పంపలేదని..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ అహంతో మాట్లాడుతున్నారంటూ తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఈటలను టీఆర్ఎస్ నుంచి ఎవరూ పంపలేదని.. ఆయనకు ఆయనే పార్టీ నుంచి వెళ్లిపోయారని అన్నారు. ఈటల రాష్ట్రమంతటా తిరిగితే ఎవరు వద్దంటున్నారని ఎద్దేవా చేశారు. ఈటల అతిగా ఊహించుకోవడం మానుకుంటే మంచిదన్నారు. బిజెపికి వ్యక్తిగీత ఏజెండా ఉండదని.. ఉమ్మడి ఏజెండానే ఉంటుందన్నారు. ఒక్కరోజలోనే ఈటల రాష్ట్రనాయకుడిగా మాట్లాడుతున్నారని.. ఈటల రాష్ట్ర నేత అయితే బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్‌రెడ్డి లాంటి వారి సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్,ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావుతో కలిసి టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జాతీయ స్థాయిలో బీజేపీ-కాంగ్రెస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందన్నారు. అయితే రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కయ్యాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బీజేపీలు బాహాటంగా సహకరించుకోవడం వల్లే హుజురాబాద్‌లో ఓటమి పాలయ్యామన్నారు. బీజేపీ – కాంగ్రెస్ సహకరించుకోవడంపై కాంగ్రెస్ సీనియర్లు కూడా ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బహిరంగంగా దుమ్మెత్తిపోస్తున్నారని అన్నారు. హుజురాబాద్‌లో ప్రజలు ప్రభుత్వ పథకాలను, సంక్షేమాన్ని చూడలేదని అన్నారు. ఈటలపై వ్యక్తిగత అభిమానంతో ఓటు వేశారని.. హుజురాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం కాదన్నారు.
అదే సమయంలో హుజూరాబాద్‌లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని మంత్రి కొప్పల అన్నారు. తప్పులు చేస్తే సరిచేసుకుంటామన్నారు. హుజురాబాద్ ఓటమిపై ఆత్మపరీశీలన చేసుకుంటాం.. పార్టీలో చర్చించుకుంటామని అన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓటు బ్యాంకు చెదిరిపోలేదని.. మా ఓట్లు మాకు వచ్చాయని అన్నారు. టిఆర్‌ఎస్ అనేక గెలుపు ఓటమిలను చూసిందన్నారు. దేశ వ్యాప్తంగా 32 ఉప ఎన్నికలు జరిగితే ఒక ఎంపీ, 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలిచిందని ఎద్దేవా చేశారు.
దళిత బంధును ఆపే ప్రసక్తే లేదని స్పష్టంచేసిన మంత్రి కొప్పల.. హుజురాబాద్‌లో అందరకి దళిత బంధు అందుతుందని స్పష్టంచేశారు. దళిత బంధు అమలు ఇప్పటికే మొదలయ్యిందన్న కొప్పుల.. ఎన్నికల సమయంలో బీజేపీ ఫిర్యాదు వల్లే ఆగిందన్నారు. దళిత బంధు వెంటనే అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. దళిత బంధు దేశం లొనే కేసీఆర్ ఆలోచనతో తెలంగాణలో మొదలైన పథకమన్నారు. బీజేపీ చెబితేనో బండి సంజయ్ చెబితేనో మొదలు పెట్టిన పథకం దళిత బంధు కాదన్నారు.
దళిత బంధుపై మాట్లాడే అర్హత బండి సంజయ్‌కు లేదని మంత్రి కొప్పుల అన్నారు. కేంద్రం నుంచి దళితులకు ఏం తెస్తారో బండి సంజయ్ చెప్పాలని ప్రశ్నించారు. దమ్ముంటే బండి సంజయ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు లాంటి పథకం పెట్టించాలని సవాల్ చేశారు. బీజేపీ నేతలు అబద్దాలతో మభ్యపెడుతున్నారని.. దళితులను మోసం చేస్తున్న పార్టీ బీజేపీగా ధ్వజమెత్తారు. హుజూరాబాద్ ఉపఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయడం విడ్డూరమన్నారు. హుజురాబాద్‌లో ఏక్కడా లేని విధంగా బీజేపీ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిందని.. దీన్ని అమలు చేసేందుకు బండి సంజయ్ కేంద్రంతో మాట్లాడాలని మంత్రి కొప్పుల డిమాండ్ చేశారు.
Also Read..
National News: దేశ ప్రజలకు కేంద్రం మరో శుభవార్త.. నిన్న పెట్రోల్, డీజీల్ ధరల తగ్గింపు.. నేడు..