పత్తి రైతులకు బాసటగా మంత్రి కోమటిరెడ్డి.. ఉపశమన ప్యాకేజీపై CCI చైర్మన్‌కి విజ్ఞప్తి
CCI చైర్మన్ లలిత్ కుమార్ గుప్తాతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సీజన్‌లో అకాల వర్షాలు, సైక్లోన్ ప్రభావం, పింక్ బోల్వార్మ్ పురుగు దాడులు..

హైదరాబాద్, అక్టోబర్ 29: ముంబైలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) చైర్మన్ లలిత్ కుమార్ గుప్తాతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సీజన్‌లో అకాల వర్షాలు, సైక్లోన్ ప్రభావం, పింక్ బోల్వార్మ్ పురుగు దాడులు, ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల వంటివి రైతులను తీవ్రంగా ప్రభావితం చేశాయని, రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు జరుగుతుందని తెలిపారు. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు రైతులపై భారీ భారమయ్యాయని వివరించారు. పత్తి తేమ శాతం సడలించి ప్రస్తుత 12% నుండి 14% వరకు పెంచాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో పత్తికి మద్దతు ధరను పెంచాలని కూడా సూచించారు. రైతులకు నష్టపరిహారం అందించేందుకు ప్రత్యేక ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.
అన్ని జిల్లాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి, రైతులు సులభంగా తమ పత్తిని విక్రయించుకునేలా చూడాలని ఆయన అభ్యర్థించారు. మార్కెట్ యార్డుల వద్ద తేమ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ వ్యాపారుల దోపిడీని అరికట్టాలని కోరారు. అదే విధంగా పింక్ బోల్వార్మ్ దాడుల కారణంగా నష్టపోయిన రైతులకు సహాయం అందించడంతో పాటు, పురుగు నిరోధక విత్తనాల పరిశోధన, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. గత సీజన్‌లో రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి కోరారు.
మంత్రి కోమటిరెడ్డి వినతిని విన్న సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా.. ప్రతిపాదించిన అంశాలను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా హాజరయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




