AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. తెల్లారి స్విమ్మింగ్ పూల్‌లో తేలిన టెకీ డెడ్‌ బాడీ..! మిస్టరీగా మరణం

ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన వీకెండ్ పార్టీలో పాల్గొన్న 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీలో ఏం జరిగింది? ఆత్మహత్య.. లేదా హత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది

ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. తెల్లారి స్విమ్మింగ్ పూల్‌లో తేలిన టెకీ డెడ్‌ బాడీ..! మిస్టరీగా మరణం
Software Engineer Farmhouse Death
Srilakshmi C
|

Updated on: Jun 15, 2026 | 10:32 AM

Share

హైదరాబాద్, జూన్‌ 15: వీకెండ్ పార్టీ కోసం ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. మృతుడు మంచిర్యాల జిల్లాకు చెందిన 27 ఏళ్ల గండ్ల రాముగా గుర్తించారు. రాము హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్ సందర్భంగా తన కార్యాలయ సహచరులు, టీమ్ లీడర్ సహా దాదాపు 15 మందితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని ఓ ఫామ్‌హౌస్‌లో పార్టీకి హాజరయ్యాడు.

శనివారం సాయంత్రం ప్రారంభమైన వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగినట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి తర్వాత రాము ఫామ్‌హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే సహచరులు అతడిని ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమిక విచారణలో రాము శరీరంపై కొన్ని గాయాల ఆనవాళ్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతని మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఫామ్‌హౌస్‌లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో ఘటన జరిగిన సమయంలో ఏం జరిగిందన్న విషయాన్ని నిర్ధారించడం పోలీసులకు సవాలుగా మారింది. పార్టీకి హాజరైన వారందరినీ పోలీసులు విచారిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి తండ్రి జి అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు రాము మరణం వెనుక హత్య కోణం ఉందని ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై స్పందించిన చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. మన్మధరావు మాట్లాడుతూ.. మృతుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణం తెలుస్తుంది అని తెలిపారు. ప్రస్తుతం పార్టీకి హాజరైన ప్రతి ఒక్కరి వాంగ్మూలాలను నమోదు చేస్తున్న పోలీసులు, రాము మరణం ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక హత్యా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Follow Us