AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: ఇకనైనా స్పందించండి.. సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ..

తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు.

Kishan Reddy: ఇకనైనా స్పందించండి.. సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ..
Kishan Reddy CM KCR
Shaik Madar Saheb
|

Updated on: Feb 15, 2023 | 7:41 PM

Share

తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా వాయుమార్గ (ఎయిర్ వేస్) అనుసంధానత కోసం అవసరమైన డెవలప్‌మెంట్ చేసి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగ పరుచుకుంటూ.. సాంకేతిక, భూపరీక్షల ఆమోదాన్ని పొందిన ఆదిలాబాద్, జక్రాన్ పల్లి (నిజామాబాద్), వరంగల్ విమానాశ్రయాల నిర్మాణానికి ముందుకు రావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.

సామాన్యుడికి కూడా విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం ‘ఉడాన్’ పథకాన్ని తీసుకొచ్చిందని.. దానికి అనుగుణంగా తెలంగాణలోనూ అన్ని రకాల అనుమతులు ఉన్నటువంటి మూడు విమానాశ్రయాల (ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, వరంగల్) నిర్మాణం జరిగితే చిన్న, ప్రైవేటు విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. విమానాశ్రయాల నిర్మాణం తదతర అంశాలకు సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ పలుమార్లు లేఖలు రాసినా, అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసినా స్పందన రాలేదంటూ పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి లేఖకు కొనసాగింపుగా.. ఈ విమానాశ్రయాల అభివృద్ధికి సహకరించాలంటూ.. తాను స్వయంగా ముఖ్యమంత్రికి 30 జూలై, 2022 నాడు లేఖ రాశానన్నారు. దీనికి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్ పల్లి, పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం), దేవకరద్ర (మహబూబ్ నగర్), మమ్నూరు (వరంగల్), బసంత్ నగర్ (పెద్దపల్లి), ఆదిలాబాద్ విమానాశ్రయాల కోసం ప్రతిపాదనలు పంపిందని.. అయితే AAI చేపట్టిన OLS సర్వే, సాయిల్ టెస్టింగ్ (భూపరీక్ష), టెక్నో-ఎకనమిక్ ఫీజిబిలిటీ స్టడీ (TEFS) చేసిన తర్వాత ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, వరంగల్ విమానాశ్రయాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసిందని కిషన్ రెడ్డి లేఖలో గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాలు అభివృద్ధి చేసి ఇమ్మని అడిగితే ఎటువంటి స్పందన రాకపోగా.. ఆ పార్టీ ఎంపీలు మాత్రం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఏం చేస్తోందంటూ ప్రశ్నలు అడగటం హాస్యాస్పదమని కిషన్ రెడ్డి అన్నారు.

2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య ప్రస్తుతం 140 దాటడం, 2026 నాటికి ఈ సంఖ్యను 220కి పెంచే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో.. విమానయాన రంగంలో ఉన్నటువంటి ఈ సానుకూలమైన వాతావరణాన్ని సద్వినియోగ పరచుకుని.. తెలంగాణ రాష్ట్రంలో కూడా విమానాశ్రయాల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారిస్తే బాగుంటుందని కిషన్ రెడ్డి సూచించారు. ఈ దిశగా సంపూర్ణ సహకారానికి పౌర విమానయాన శాఖ ఇదివరకే సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని ఈ లేఖ ద్వారా, కిషన్ రెడ్డి మరోసారి గుర్తుచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..