Harisharao : దేశ జీడీపీకి కాంట్రిబ్యూషన్‌లో తెలంగాణ ఆరోస్థానం.. మంత్రి హరీష్ రావు వెల్లడి
తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ రెట్టింపు అయ్యిందన్నారు.
Telangana Minister Harish Rao: తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ రెట్టింపు అయ్యిందన్నారు. రాష్ట్రంలో సంపద పెరుగుదల, ఆర్థిక పరిస్థితిపై మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలది అవగాహన రాహిత్యమని తప్పుబట్టారు. విపక్షాలు రాజకీయ లబ్ది కోసమే అబద్దాలు మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారమే తాను మాట్లాడుతున్నానని, వృద్ధిరేటులో తెలంగాణ రెట్టింపు సాధించిందన్నారు.
దేశంలో వృద్ధిరేటు 50 శాతం మాత్రమే ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో స్థిరంగా కొనసాగుతోందని, కరోనా కాలంలోనూ తెలంగాణ పాజిటివ్ వృద్ధిరేటు సాధించిందని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందన్నారు. దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ రెట్టింపయిందని చెప్పారు. జీఎస్‌డీపీలో దేశంలో మూడో స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏడాది ఒక శాతం జీడీపీ పెరుగుతున్నదని వెల్లడించారు. దేశ జీడీపీకి కాంట్రిబ్యూషన్‌లో తెలంగాణది ఆరోస్థానం అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు నాలుగు శాతం ఉన్న జీడీపీ ఇప్పుడు 5 శాతానికి పెరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థల నివేదికల నుంచే వివరాలు సేకరించామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
రాష్ట్రాలు, దేశాల వృద్ధిని పారా మీటర్ల ఆధారంగా లెక్కచేస్తారని తెలిపారు. కరోనా సంవత్సరంలోనూ 2.4 శాతం వృద్ధిరేటు సాధించామని మంత్రి హరీష్ స్పష్టం చేశారు. దేశంలో జీడీపీ మైనస్ 3 శాతం వృద్ధి నమోదయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో.. అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు కళ్లులా, అవలంభించే విధానాలతోనే తెలంగాణ వృద్ధిరేటు పెరుగుతున్నదని చెప్పారు. బంగ్లాదేశ్ కంటే భారత్ వృద్ధిరేటు చాలా తక్కువగా ఉందని ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తించాలన్నారు. బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 1887 డాలర్లు కాగా, భారత్ తలసరి ఆదాయం 1877 డాలర్లని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,37,638గా ఉందన్నారు. ఏడేండ్లలో 3వ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని చెప్పారు. తలసరి ఆదాయాన్ని చూస్తే ఎవరి పనితీరు ఏందో ప్రజల ముందు ఉదని దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర తలసరి ఆదాయం 11.5 శాతం, దేశ తలసరి ఆదాయం 4 శాతం అన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పురోగతి సాధించామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశంలో 10 స్థానంలో ఉన్నామని, ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నామని చెప్పారు.
పన్నువసూళ్లలో 11.52 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో దేశం వృద్ధిరేటు 3.6 శాతం అయితే.. తెలంగాణ వృద్ధి రేటు 14.3 శాతమన్నారు. తయారీ రంగంలో 72 శాతం, ఐటీ రంగంలో 120 శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపారు. ప్రాథమిక రంగంలో రాష్ట్రం దేశంలోనే అత్యంత అభివృద్ధి సాధించిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, గ్రామీణ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతో అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 14.5 శాతం ఎక్కువ వృద్ధిరేటు సాధించామన్నారు.
తెలంగాణలో పరిశ్రమలతో పాటు కుల వృత్తులకు మంచి ప్రోత్సాహకం అందిస్తున్నామని మంత్రి హరీష్ తెలిపారు. పశువుల పెంపకం రంగంలో మూడు రెట్లు, చేపల పెంపకంలో ఆదాయం రెట్టింపు అయిందన్నారు. వరి ఉత్పత్తిలో రూ.9,528 కోట్ల నుంచి రూ.47,440 కోట్లకు ఆదాయం పెరిగింది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నామన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దాదాపు 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఉచితంగా కరెంటు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే కోతలు లేని కరెంటు ఇచ్చే రాష్ట్రంగా ఎదిగామన్నారు. పరిశ్రమలు, సర్వీస్, నిర్మాణ రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామన్నారు. కేంద్రానికి ఇచ్చే నిధులు ఎక్కువ.. కేంద్రం మనకు ఇచ్చేది తక్కువ అని విమర్శించారు.
Watch Live: Press Conference at MCRHRD https://t.co/2bdLhSV6pJ
— Harish Rao Thanneeru (@trsharish) August 23, 2021
Srikakulam: పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసుల దుర్మరణం, పలువురికి తీవ్రగాయాలు