Assurances to Telangana: తెలంగాణకు కేంద్రమిచ్చిందేంటి..? హుజురాబాద్‌లో నిలదీసేందుకు గులాబీ దళం రెడీ

తెలంగాణ అభివృద్ది నేపథ్యంలోనే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఎవరు ఏమీ చేశారంటే మరొకరు ఏమి చేశారంటూ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గత ఏడేళ్ళలో కేంద్రంలో బీజేపీ అధికారంలో వున్నా.. తెలంగాణకు ఏమీ చేయలేదన్నది గులాబీ దళం వాదన. ఈక్రమంలో వారు...

Assurances to Telangana: తెలంగాణకు కేంద్రమిచ్చిందేంటి..? హుజురాబాద్‌లో నిలదీసేందుకు గులాబీ దళం రెడీ
Telangana
Follow us
Rajesh Sharma

|

Updated on: Aug 23, 2021 | 3:57 PM

Assurances to Telangana not fulfilled so far by BJP Govt: హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో ఇపుడు హాట్ టాపిక్. అటు రాష్ట్రంలో పాలక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇటు కేంద్రంలో పాలక పక్షం భారతీయ జనతా పార్టీ.. ఇంకోవైపు మనుగడ కోసం పరితపిస్తున్న కాంగ్రెస్ పార్టీలు హుజురాబాద్‌లో విజయం సాధించాలన్న పట్టుదలతో వ్యూహాలు రచిస్తున్నాయి. ఎలా విశ్లేషించినా.. హుజురాబాద్ ఉప ఎన్నికల దిశగా కొనసాగుతున్న ప్రయాణంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ముందుందనే చెప్పాలి. ఎందుకంటే ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయక ముందు నుంచే టీఆర్ఎస్ హుజురాబాద్ నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా వుండేందుకు చర్యలు చేపట్టింది. ఈటల రాజేందర్ వెంట వెళతారని భావించిన ప్రతీ వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు గులాబీ దళం సామ, దాన, భేద, దండోపాయాలను అనుసరించింది. ఈ ప్రయత్నంలో గులాబీ దళం విజయం సాధించిందనే చెప్పాలి. ఈటల వెంట వెళ్ళకుండా చాలా మందిని నియంత్రించారు. అదేసమయంలో ఈటల రాజేందర్ వెంట తొలినాళ్ళలో నడిచిన వారిలో ఎక్కువ మందిని తిరిగి గులాబీ గూటికి తిరిగొచ్చేలా చేసుకున్నారు. దానికితో కొత్త సంక్షేమ పథకం దళిత బంధును హుజురాబాద్ నుంచే ప్రారంభించడం ద్వారా ముఖ్యమంత్రి, గులాబీ దళపది కేసీఆర్.. ప్రత్యర్థులపై బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. ప్రతీ దళిత కుటుంబానికి ఏకంగా పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి.. వారిని అభివృద్ధిపథంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. ముందుగా హుజురాబాద్‌ నియోజకవర్గంలోని 15 మంది లబ్దిదారులను గుర్తించి.. వారికి ఆర్థిక సాయం చేయాలని తలపెట్టారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి స్వయంగా హుజురాబాద్ పర్యటనలో ప్రారంభించారు. తాజాగా ఈ పథకం అమలుకోసం 500 రూపాయలను విడుదల చేస్తూ ఆగస్టు 23న ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది కేసీఆర్ సర్కార్. ఇదంతా ఒకెత్తైతే.. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది.

తెలంగాణ అభివృద్ది నేపథ్యంలోనే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఎవరు ఏమీ చేశారంటే మరొకరు ఏమి చేశారంటూ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గత ఏడేళ్ళలో కేంద్రంలో బీజేపీ అధికారంలో వున్నా.. తెలంగాణకు ఏమీ చేయలేదన్నది గులాబీ దళం వాదన. ఈక్రమంలో వారు విడుదల చేసిన వివరాలు కాస్త ఆలోచింపచేసేవిగానే వున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా 2014 విభజన చట్టంలో పేర్కొన్న ప్రధాన హామీ విషయంలోను కేంద్రం ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని గత ఏడేళ్ళ అనుభవం తేలుస్తోంది. రాష్ట్రంలో చేపట్టిన ఏదైనా సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని విభజనచట్టంలో పేర్కొన్నారు. 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. వందలాది అడుగుల పైకి నీటిని ఎత్తిపోయడం ద్వారా వందలాది కిలోమీటర్ల దూరం గోదావరి నదీజలాలను తరలించి.. మెదక్ వంటి కరువు జిల్లాలను సస్యశ్యామలం చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే వేలాది కోట్ల రూపాయలను వెచ్చించింది. అనుకున్నట్లుగానే ప్రాజెక్టును పూర్తి చేసింది. అయితే.. ఈప్రాజెక్టును చేప్టటినప్పట్నించి కూడా దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూనే వుంది. ఏనాడు సానుకూల స్పందన రాలేదు. మరోవైపు అదే విభజన చట్టంలో ప్రస్తావించిన పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదానిస్తూ ఏపీకి మోదీ ప్రభుత్వం సహకరించింది.

ఇక విభజన చట్టంలోని 13వ షెడ్యూలులో తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పుతామని పేర్కొన్నారు. గత ఏడేళ్ళలో ఈ దిశగా అడుగులు పడలేదు సరికదా.. నిర్దిష్టమైన ప్రకటన కూడా కేంద్ర పెద్దల నుంచి గానీ.. తెలంగాణ బీజేపీ ఎంపీల నుంచి గానీ రాలేదు. ఇక కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి కూడా విభజన చట్టంలో ప్రస్తావించారు. కానీ నేటికీ అది నెరవేరలేదు. సరికదా.. గట్టిగా ప్రశ్నిస్తే. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేమని కేంద్ర మంత్రి తేల్చి చెప్పేసి.. తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా నెరవేరలేదు. మరోవైపు గిరిజన ప్రాంతమైన ములుగు ఏరియాలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పలుమార్లు ప్రకటనలు చేసినా.. అవి నేటికి కూడా నెరవేరనేలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున యూనివర్సిటీ ఏర్పాటుకు స్థలం కేటాయించడంతోపాటు.. తాత్కాలిక వసతి కోసం భవనాన్ని కేటాయించినా.. కేంద్రం ఒక్క అడుగు ముందుకేయలేదు. అదేసమయంలో ఏపీకి మాత్రం స్థలం కేటాయించకపోయినా ట్రైబల్ యూనివర్సిటీని మంజూరు చేసింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు రూ.19,205 కోట్లు కేటాయించాలంటూ నీతి ఆయోగ్ 2016లోనే సిఫారసు చేసినా.. అయిదేళ్ళ తర్వాత కూడా ఒక్క రూపాయలు కేటాయించలేదు. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని హుజురాబాద్ బరిలో బీజేపీ నేతలను నిలదీసేందుకు స్థానిక ఓటర్లు సిద్దం కావాలని టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు.

ALSO READ: హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో కొండా సురేఖ..! ఆమె అభ్యర్థిత్వానికే పలువురు మొగ్గు.. ఎందుకంటే?

ALSO READ: తాలిబన్లకు ముందుంది ముసళ్ళ పండగ.. పరిపాలనలో ముష్కర మూకల ముందు పెను సవాళ్ళు.. ఇవేనా?