AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కుంకుడు రైతుకు పద్మారెడ్డికి మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం..

నల్గొండ జిల్లాకు చెందిన రైతు లోకసాని పద్మారెడ్డి వ్యవసాయానికి చేసిన విశేష సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 'మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా'గా సత్కరించింది. పద్మా రెడ్డి హార్టికల్చర్‌లో అధునాతన శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా విశేషమైన దిగుబడులు సాధించారు.

Telangana: కుంకుడు రైతుకు పద్మారెడ్డికి మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం..
Padma Reddy
M Revan Reddy
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 05, 2024 | 1:12 PM

Share

వ్యవసాయం అంటే ఇష్టముండాలే కానీ.. బీడు భూమిలో కూడా బంగారం పండిచొచ్చు అని నిరూపిస్తున్నారు కొంత మంది అన్నదాతలు. అందుకు నిదర్శనమే ఈ రైతు కూడా. కరువు ప్రాంతంలో కృషిని నమ్ముకొని ధైర్యంగా వేసిన ఓ అడుగు.. 33 ఏళ్లుగా సిరులు కురిపిస్తోంది. అది కూడా ఎకరాకు కేవలం 5 వేల పెట్టుబడితో 13 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాడు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా కుంకుడు మొక్కల నర్సరీని ఏర్పాటుచేసి మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

నల్లగొండ జిల్లా అంటేనే కరువు కాటకాలతో కూడిన ప్రాంతం. భూగర్భ జలాలు లేక రైతులు అల్లాడుతుంటారు. చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన రైతు లోకసాని పద్మారెడ్డి. ఆయనకు 12 ఎకరాల భూమి ఉంది. నీటి వసతి అంతగా లేక భూమి అంతా బీడువారిపోయింది. అయితే..కరువు ప్రాంతంలో ఆయన ధైర్యంగా అడుగు వేసి.. కుంకుడు మొక్కలకు పెద్దగా నీటి అవసరం లేదని తెలుసుకున్న పద్మారెడ్డి.. తన 12 ఎకరాల పొలంలో 1991లోనే 1200 కుంకుడు మొక్కలు నాటాడు. ఒక్కో మొక్క ద్వారా 250 నుంచి 300 కిలోల కుంకుడు కాయల దిగుబడి వస్తున్నది. అలా ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. కిలో కుంకుడుకాయలు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. కుంకుడు తోట పెట్టి ఎకరానికి 13 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నాడు.

ఆయన సాగుబడి అంతా సేంద్రియ విధానంలోనే సాగుతోంది. దీంతో ఆయన దేశంలోనే మొట్ట మొదటి సారిగా కుంకుడు కాయల మొక్కల నర్సరీని పెంచాడు. కుంకుడు కాయల గుజ్జు, గింజల పొడితో సౌందర్య ఉత్పత్తులు, ఔషధాలు కూడా చేయవచ్చని పద్మారెడ్డి చెబుతున్నారు. ఈ మేరకు ఆయన నర్సరీలో పెంచిన కుంకుడు మొక్కలను ఛత్తీస్‌గఢ్‌ అటవీశాఖ అధికారులు దిగుబడి చేసుకుంటున్నారు. పేస్ట్‌, సబ్బులను తయారు చేసి నాబార్డ్‌ ద్వారా విక్రయిస్తున్నారు సహజ, సేంద్రియ ఎరువులతో బత్తాయి, నిమ్మ, జామ, బొప్పాయి తోటలను పండిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రైతులు పద్మారెడ్డి క్షేత్రాన్ని సందర్శించి.. ఉద్యాన పంటల సాగులో మెలకువలు నేర్చుకుంటున్నారు. దేశంలోని ఉత్తమ రైతు సేవలను గుర్తిస్తూ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి పురస్కారాలను అందిస్తుంది. దేశంలోనే మొట్టమొదటి కుంకుడు మొక్కల నర్సరీని ఏర్పాటుచేసిన లోకసాని పద్మా రెడ్డినీ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారానికి ఎంపిక చేసింది. త్వరలోనే దిల్లీలో జరిగే సభలో పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. పెద్ద కమతాలు ఉండి, సీజనల్‌ పంటలు సాగు చేసుకోలేక బీడు పెడుతున్న రైతులు ఈ కుంకుడు తోటలను సులువుగా సాగు చేసుకోవచ్చని.. ఫలితంగా మంది ఆదాయం పొందవచ్చని పద్మా రెడ్డి సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..