Telangana Election 2023: సచ్ఛీలురెందరు.. నేరస్థులెందరు? తెలంగాణ ఎమ్మెల్యేల నేరచరితపై ADR సంచలన రిపోర్ట్

ADR Survey: తెలంగాణ దంగల్ కీలక దశకు చేరుకుంది. అన్ని పార్టీలూ అభ్యర్థుల జాబితాల్ని దాదాపుగా పూర్తి చేసినట్టే. వాట్ నెక్స్ట్ అంటే ఇంకేముంది... నామినేషన్ల పర్వమేగా? ఇదే గ్యాప్‌లో అభ్యర్థులంతా డీజీపీ ఆఫీసుకు క్యూ కట్టేశారట. మేమెంత స్వచ్ఛమైన నేతలం... మా మీదుండే కేసులెన్ని... కొట్టివేసిన కేసులెన్ని.. చెప్పండి మహాప్రభో అంటూ ఆరా తీస్తున్నారట.

Telangana Election 2023: సచ్ఛీలురెందరు.. నేరస్థులెందరు? తెలంగాణ ఎమ్మెల్యేల నేరచరితపై ADR సంచలన రిపోర్ట్
Telangana Elections
Follow us
Vijay Saatha

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 29, 2023 | 8:01 AM

ADR Survey: తెలంగాణ దంగల్ కీలక దశకు చేరుకుంది. అన్ని పార్టీలూ అభ్యర్థుల జాబితాల్ని దాదాపుగా పూర్తి చేసినట్టే. వాట్ నెక్స్ట్ అంటే ఇంకేముంది… నామినేషన్ల పర్వమేగా? ఇదే గ్యాప్‌లో అభ్యర్థులంతా డీజీపీ ఆఫీసుకు క్యూ కట్టేశారట. మేమెంత స్వచ్ఛమైన నేతలం… మా మీదుండే కేసులెన్ని… కొట్టివేసిన కేసులెన్ని.. చెప్పండి మహాప్రభో అంటూ ఆరా తీస్తున్నారట. ఎందుకని? వీళ్ల నేర చరితకు, నామినేషన్ల ఘట్టానికి ఉండే లింకేంటి?..

తెలంగాణ దంగల్‌ ముంచుకొస్తోంది. మరో నెలరోజుల్లో పోలింగ్ టైమ్‌. నవంబర్ 10 నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. పోటీలో నిలిచే అభ్యర్థులు ఆలోగా తమతమ బయోడేటాలతో సమగ్రమైన సమాచారంతో అఫిడవిట్‌తో కూడిన నామినేషన్లు సమర్పించాలి. ప్రస్తుత ఎమ్మెల్యేల గుణగణాలు, వారివారి నేర చరిత్రలపై ప్రత్యేక అధ్యయనం చేసింది అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్‌.. ADR. ఇందులో విస్తుగొలిపే అంశాలు అనేకం.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా రూపొందించిన నివేదిక ఇది. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలపై కేసుల వివరాల్ని పరిశీలిస్తే… అందులో తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. మొత్తం 118 మంది తెలంగాణ ఎమ్మెల్యేల్లో అత్యధికంగా అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైనే ఎక్కువ కేసులు ఉన్నట్టు చెబుతోంది ADR రిపోర్ట్. 118 మంది తెలంగాణ ఎమ్మెల్యేల్లో ఏకంగా 72 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 46 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర నేరానికి పాల్పడ్డట్టు అభియోగాలున్నాయి. అటెంప్ట్ టు మర్డర్… అంటే హత్యాయత్నం కేసులున్న ఎమ్మెల్యేలు ఏడుగురు. నలుగురు ఎమ్మెల్యేలపై మహిళలను వేధించిన కేసులున్నాయి. ఈ నలుగురిలో ఒక ఎమ్మెల్యేపై రేప్ కేసులున్నట్టు ADR రిపోర్ట్ చెబుతోంది.

బీఆర్ఎస్‌కి చెందిన 101 ఎమ్మెల్యేల్లో 59 మంది ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో 38 మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. ఏడుగురు MIM ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, బీజేపీలో ఇద్దరు ఎమ్మల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ రిపోర్ట్ లో పేర్కొంది.

ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసుల విచారణ కోసం 2018 తర్వాత రాష్ట్రానికో ప్రత్యేక కోర్టును కేటాయించింది సుప్రీంకోర్టు. ఇందులో ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించిన విచారణ ప్రతిరోజూ జరుగుతూ వస్తోంది. గత నాలుగేళ్లలో జరిగిన విచారణ తర్వాత ఎన్ని కేసులు క్లియరయ్యాయి.. ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి అనేది తేలాల్సిన లెక్క. కానీ.. ఈ తాజా వివరాలతోనే అభ్యర్థులు నామినేషన్ల సమయంలో అఫిడవిట్లు రాసివ్వాల్సి ఉంది.

అందుకే… ప్రస్తుతం తమపై ఎన్ని కేసులున్నాయో చెప్పాలంటూ నేతలంతా డీజీపీ ఆఫీసుకు క్యూలు కడుతున్నారు. డీజీపీ ఆఫీస్ నుంచి వివరాలు తీసుకున్న తర్వాతే నామినేషన్లు దాఖలౌతాయ్. ఏ అభ్యర్థి ఎంత సచ్ఛీలుడు.. ఎంతటి నేరచరితుడో తేలేది కూడా అప్పుడే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..