అలాంటి వారిని పదవులు వెతుక్కుంటూ వస్తాయ్! ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు
ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, పార్టీ బలోపేతం కోసం క్రియాశీల కార్యకర్తలకు పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయంతో కూడిన పదవి పంపిణీని ప్రాధాన్యతనిస్తామని, రాహుల్ గాంధీ సిద్ధాంతాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

పార్టీ కోసం కష్టపడడండి.. పదవులు వాటంతట అవే మిమిల్ని వెతుక్కూంటూ వస్తాయని పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్. డీసీసీ అధ్యక్షులతో భేటీలో పార్టీశ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థలు టార్గెట్‌గా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల గెలుపును స్థానిక సంస్థల ఎన్నికల్లో కొనసాగించేందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులను యాక్టివేట్ చేస్తున్నారు తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్. వరుస సమీక్షలు, అసంతృప్తుల బుజ్జగింపులతో బిజీబిజీగా గడుపుతున్న మీనాక్షి గ్రౌండ్ లెవల్‌లో నేతల అభిప్రాయలను, పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
ఎప్పటికప్పుడూ జిల్లా వారిగా రివ్యూ చేస్తున్నారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు మీనాక్షి. పార్టీ కోసం పనిచేసిన నేతలకు పదవులతో పాటు కచ్చితంగా పార్టీ గుర్తిస్తోందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కాపాడుతూనే.. పార్టీలో, ప్రభుత్వంలో పదవుల పంపిణీ చేస్తోందని నేతలకు చెప్పారు. రాహుల్ గాంధీ సమాజంలో ఎవరి వాటా వారికి ఇవ్వాలన్న సిద్ధాంతంతో పని చేస్తున్నారని తెలిపారు మీనాక్షి. రాహుల్ సిద్ధాంతాలను మనం తూచతప్పకుండా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని పదవుల్లో సామాజిక న్యాయాన్ని పాటించాం.. ఇకపై కూడా అలాగే కొనసాగుతాయని అన్నారు.
పార్టీ కోసం క్రియాశీలకంగా, శక్తి వంచన లేకుండా పని చేసిన ప్రతీ కార్యకర్తకు, నాయకులకు పదవులు లభిస్తాయని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం.. కొత్త, పాత నేతలు అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సమిష్టిగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లుగానే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ గెలిపించేందుకు డీసీసీ అధ్యక్షులు జిల్లాలోని నేతలందరిని కోఆర్డినేట్ చేసుకొని పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ఎన్నికలు ఏ క్షణం వచ్చినా.. సిద్ధంగా ఉండాలని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..