మరో 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం.. భవిష్యత్తులో బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలకు పేదల బంధు: కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి కమిటీల పునర్నిర్మాణంపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. అలాగే దళిత బంధు పధకం అమలుపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
దళిత బంధు పధకంపై ప్రజలను చైతన్యం చేయాలని.. అందుకోసం ప్రతీ ఊరులోనూ అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే ప్రతిపక్షాలు చేసే తప్పుడు విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కమిటీల ఏర్పాటు ప్రక్రియ వారంలో ప్రారంభం కావాలన్నారు. నవంబర్ మొదటి వారంలో పార్టీ ప్లీనరీ ఉంటుందని తెలిపారు. రానున్న 20 ఏళ్లు కూడా టీఆర్ఎస్‌దే అధికారమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దశలవారీగా అన్ని వర్గాలవారికి న్యాయం చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలలోని పేదల కోసం పేదల బంధు కూడా తెస్తామని స్పష్టం చేశారు. కొత్త జిల్లా అధ్యక్షులను నియమిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అటు సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమి పూజ నిర్వహిస్తామని తెలిపారు.
అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత జిల్లా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్‌లో టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది సభను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌దే గెలుపు అని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. కాగా, దళిత బంధుపై ప్రతిపక్షాలది పనికిమాలిన విమర్శలని ఆరోపించారు. విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్‌లో దళిత బంధుపై సూచనలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ తెలిపారు.