AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కేబినెట్‌లో చోటు దక్కించుకునేదెవరు..? హైకమండ్‌ మదిలో ఎవరున్నారు…?

ఓవైపు మంతనాలు... మరోవైపు అధిష్టానానికి లేఖలు. యస్... తెలంగాణ కేబినెట్‌లో చోటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. స్టేట్‌లోనే కాదు ఢిల్లీలోనూ గట్టిగానే లాబీయింగ్‌ చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసిన షార్ట్‌ లిస్టులో ఎవరి పేర్లున్నాయ్...? హైకమండ్‌ మదిలో ఎవరున్నారు...? ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు కాబోతున్నారు...!

Telangana: కేబినెట్‌లో చోటు దక్కించుకునేదెవరు..? హైకమండ్‌ మదిలో ఎవరున్నారు...?
Ram Naramaneni
|

Updated on: Dec 12, 2024 | 9:02 PM

Share

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైనప్పటికీ… సీఎం రేవంత్‌ సహా మరో 11 మంది మంత్రులతోనే ప్రభుత్వం నడుస్తోంది. ఇంకా మరో ఆరుగురికి అవకాశం ఉన్నప్పటికీ…. ఆ దిశగా అడుగులు పడలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేబినెట్‌ విస్తరణ కోసమే అన్నట్లుగా ప్రచారం జరిగినా… ఎలాంటి ఫలితం లేదు. అయితే కొత్త ఏడాదిలో సరికొత్త జోష్‌తో తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం ప్రకటనకు తగినట్టుగానే సంక్రాంతిలోపే కేబినెట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ముందుకెళ్తోంది. షార్ట్‌ లిస్ట్‌ తయారు చేసి అధిష్టానం ముందుంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి పార్టీ పెద్దలతో కేబినెట్‌ విస్తరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి గుడ్‌న్యూస్‌తోనే ఢిల్లీ నుంచి వస్తారంటూ గాంధీభవన్‌లో టాక్‌ వినిపిస్తోంది.

ఇక కేబినెట్‌లో చోటు కోసం నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ పెద్దలతో లాబీయింగ్‌ చేయడమే కాదు… రాష్ట్రంలోని ముఖ్యనేతలను కలిసి మంత్రి పదవి కోసం శ్రమిస్తున్నారు. ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, మదన్‌మోహన్‌రావు ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని కోరారు. మల్‌రెడ్డి రంగారెడ్డి అధిష్టానం పెద్దలకు లేఖలు కూడా రాశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కేబినెట్‌లో ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేనంటూ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ నుండి ప్రేమ్‌సాగర్ రావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్‌ కేబినెట్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఒకరికి అవకాశం దక్కనుంది. అలాగే నిజామాబాద్ నుంచి పి.సుదర్శన్ రెడ్డి పేరు కూడా బాగానే వినిపిస్తోంది. అలాగే మైనారిటీ కోటాలో ఫిరోజ్‌ఖాన్‌ మంత్రి పదవి ఆశిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇటు కేబినెట్‌ విస్తరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు ఎవరికివ్వాలన్న విషయంలో హైకమాండ్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. అయితే.. మంత్రి పదవుల భర్తీతో పాటు ఇప్పడు మంత్రులకు ఉన్న శాఖలు మార్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పోస్టులను కూడా భర్తీ చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా… న్యూ ఇయర్‌ నుంచి నయా జోష్‌తో ముందుకెళ్తామన్న రేవంత్‌ సర్కార్‌లో మంత్రి పదవులు దక్కించుకునే ఆ ఆరుగురు అదృష్టవంతులెవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే…!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి