AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ సంచలన ప్రకటన..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. నగదు రహిత వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న లక్షలాది కుటుంబాలకు భరోసా ఇస్తూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో శుభవార్త వినిపించారు. ప్రతిష్టాత్మక ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను ప్రారంభిస్తూ, ప్రతి ఉద్యోగికి డిజిటల్ కార్డులు అందజేయనున్నట్లు ప్రకటించారు.

Telangana: ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ సంచలన ప్రకటన..
Telangana Employees Health Scheme
Krishna S
|

Updated on: Mar 20, 2026 | 1:56 PM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల దశాబ్దాల కలలను నెరవేరుస్తూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2026-27 వార్షిక బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు రూ. 13,679 కోట్లు కేటాయించారు. కేవలం నిధుల కేటాయింపుతోనే ఆగకుండా నగదు రహిత చికిత్స దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటి నుంచో కోరుతున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ప్రతి ఉద్యోగికి, పెన్షనర్‌కు ప్రత్యేకమైన డిజిటల్ హెల్త్ కార్డులను ప్రభుత్వం అందజేయనుంది. దీనివల్ల ఆసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా చికిత్స పొందవచ్చు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంప్యానెల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చు. దాదాపు రెండు వేల రకాల జబ్బులకు ఈ పథకం కింద చికిత్స అందుబాటులో ఉంటుంది.

ఆసుపత్రుల విస్తరణ – బెడ్ల పెంపు

రాష్ట్రంలో టెర్షియరీ కేర్ సౌకర్యాలను పెంచేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మిస్తున్న సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీ నగర్ టిమ్స్ ఆసుపత్రులను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో అదనంగా 2,000 బెడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తయితే మొత్తం బెడ్ల సంఖ్య 3,639కి పెరుగుతుంది. 24 అంతస్తులతో నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏప్రిల్ 2026 నుండి డయాగ్నస్టిక్ సేవలతో ప్రారంభించనున్నారు. నిమ్స్, వరంగల్, ఇతర ఆసుపత్రుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6,582 కొత్త టెర్షియరీ కేర్ బెడ్లు అందుబాటులోకి రానున్నాయి.

రాష్ట్రంలో వైద్య నిపుణుల కొరత లేకుండా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోంది. భట్టి తన ప్రసంగంలో ఇప్పటికే 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ స్కూల్స్, 28 పారా మెడికల్ కాలేజీలు ప్రారంభమై సేవలు అందిస్తున్నాయని వివరించారు.

Follow Us