- Telugu News Photo Gallery Community Mourns Sacred Ox: A Symbol of Devotion and Spiritual Significance
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో స్థానికుల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన తోమడపు ఎద్దుకు సోమవారం ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించారు. సింహాద్రి అప్పన్న స్వామి స్వరూపంగా భావించి ఎన్నో సంవత్సరాలుగా పూజలు అందుకున్న ఈ ఎద్దు మృతి చెందడంతో స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Updated on: Jul 07, 2026 | 10:45 PM

విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో స్థానికుల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన తోమడపు ఎద్దుకు సోమవారం ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించారు. సింహాద్రి అప్పన్న స్వామి స్వరూపంగా భావించి ఎన్నో సంవత్సరాలుగా పూజలు అందుకున్న ఈ ఎద్దు మృతి చెందడంతో స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

పట్టణంలోని వేమలి వీధిలో నివసించే ప్రజలు ఈ తోమడపు ఎద్దును ప్రత్యేక భక్తితో చూసేవారు. శుభకార్యాలు, పండుగలు, ఆలయ ఉత్సవాల సందర్భంగా ఎద్దుకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగేది. ఈ నేపథ్యంలో ఎద్దు మృతి చెందిన వార్తతో పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి నివాళులర్పించారు.

వేమలి వీధి నుంచి శృంగవరపుకోట ప్రధాన వీధుల గుండా అంతిమ యాత్ర నిర్వహించారు. పూలమాలలతో అలంకరించిన ఎద్దుకు భక్తులు పుష్పాంజలి ఘటిస్తూ, భజనలు చేస్తూ గౌరవప్రదంగా చివరి వీడ్కోలు పలికారు. అంతిమ యాత్రలో మహిళలు, వృద్ధులు, యువకులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

అనంతరం వేమలి వారి కల్లాల్లో సంప్రదాయబద్ధంగా తోమడపు ఎద్దును ఖననం చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు భావోద్వేగానికి లోనై కన్నీరుమున్నీరుగా వీడ్కోలు పలికారు. స్థానికుల ఆధ్యాత్మిక విశ్వాసంలో ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ తోమడపు ఎద్దు మృతి శృంగవరపుకోట ప్రజలను తీవ్రంగా కలచివేసింది.

ఈ ఘటనతో పట్టణంలో విషాద వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు తోమడపు సింహాద్రి అప్పన్న ప్రతిరూపంగా తమ గ్రామంలో సంచరించడం వల్ల ఎంతో మేలు జరిగిందని, ఇక పై ఆ దేవుడే తమ గ్రామానికి దిక్కు అని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు.