AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deeksha Diwas: నేడు అలుగునూర్‌లో బీఆఎస్‌ దీక్ష దీవాస్.. హాజరు కానున్న కేటీఆర్‌

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే విషయంలో కేసీఆర్ పాత్రపై పలువురు ప్రసంగించవచ్చు.. గానీ.. కేసీఆర్‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదాం తో ముందుకు సాగారు. నవంబర్ 29న కరీంనగర్ జిల్లాలోని అల్గనూర్ చౌరస్తా వేదికైంది..

Deeksha Diwas: నేడు అలుగునూర్‌లో బీఆఎస్‌ దీక్ష దీవాస్.. హాజరు కానున్న కేటీఆర్‌
G Sampath Kumar
| Edited By: Subhash Goud|

Updated on: Nov 29, 2024 | 7:33 AM

Share

ఒక్క ఘట్టం ఒక ఉమ్మడి రాష్ట్ర రాతనే మార్చింది. అప్పటికే పతాకస్థాయికి చేరిన ప్రత్యేకవాదనకు బలం చేకూర్చింది. తెలంగాణా తెచ్చుడో , కేసీఆర్ సచ్చుడోనన్న వాదనతో ఆమరణ నిరాహార దీక్షకు దిగేందుకు సిద్ధిపేటకు తరలివెళ్తున్న నాటి ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఉద్యమం మరింత రగులుకుంది. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో ఢిల్లీ దిగిరాక తప్పలేదు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మన్నించకా తప్పలేదు. అలా తెలంగాణా ఏర్పాటైంది. అందుకు ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లా వేదికైంది. నవంబర్ 29 దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహిస్తుంది.

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే విషయంలో కేసీఆర్ పాత్రపై పలువురు ప్రసంగించవచ్చు.. గానీ.. కేసీఆర్‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదాం తో ముందుకు సాగారు. నవంబర్ 29న కరీంనగర్ జిల్లాలోని అల్గనూర్ చౌరస్తా వేదికైంది. తెలంగాణా అజరామర చరిత్రకు ఓ చెరగని సంతకమైంది. సిద్ధిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన కేసీఆర్.. కరీంనగర్ లోని తన ఉత్తర తెలంగాణా భవన్ నుంచి బయల్దేరాడు. అదిగో అప్పుడే కరీంనగర్ అలా దాటాడో, లేదో పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి ఖమ్మంకు తీసుకెళ్లారు. కానీ, కేసీఆర్ ఆ ప్రయాణంలోనే తన ఆమరణ దీక్షను ప్రారంభించారు. దాంతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ప్రాంతం అట్టుడికింది.

2004లో అప్పటి టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని.. అలాగే, యూపీఏ ఉమ్మడి ప్రణాళికలో పార్లమెంట్ సాక్షిగా తెలంగాణా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టే పనిలో నేటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. ఆ సమయమంతా భావోద్వేగాలు రగులుకుంటున్న టైం. సరిగ్గా అదే సమయంలో 2009, అక్టోబర్ 21న సిద్ధిపేటలో జరిగిన సింహగర్జనతో ఉద్యమం కొత్త రూపు దాల్చింది. తెలంగాణా కోసం నేనే ఆమరణ దీక్ష చేస్తా.. తెలంగాణా ఎలా రాదో చూస్తానంటూ కేసీఆర్ ప్రకటించారు. అందుకోసం నవంబర్ 29న కేసీఆర్ దీక్ష కోసం సిద్ధిపేట రంగధాంపల్లి వద్ద దీక్షా వేదికే ఏర్పాటైంది. నవంబర్ 28న తెలంగాణా తల్లికి హైదరాబాద్‌లో పూలమాల వేసిన కేసీఆర్.. ఆ తర్వాత కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణా భవన్‌కు చేరుకున్నారు. కరీంనగర్ నుంచి సిద్ధిపేటకు వెళ్లే క్రమంలో పోలీసులు చుట్టుముట్టారు. దాంతో తెలంగాణా వ్యాప్తంగా అలజడి చెలరేగింది.

మరోవైపు ప్రొఫెసర్ జయశంకర్ తో పాటు.. కేటీఆర్ వంటివారూ ఆమరణ దీక్షలకు దిగారు. ఇంకోవైపు అటు సిద్ధిపేట రంగధాంపల్లి సభాస్థలి వద్దా ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత ఖమ్మం వేదికగా జరిగిన హైడ్రామాలూ తెలంగాణాలోని భావోద్వేగ రాజకీయాల్ని ఎప్పటికప్పుడు తెరపైకి తెచ్చాయి. మొత్తంగా నవంబర్ 29వ తేదీకి దీక్షా దివస్‌గా ప్రాధాన్యత దక్కింది. ఇప్పుడు ఏకంగా తెలంగాణా రాష్ట్రమే వచ్చింది. ఆ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ఉద్యమనేత కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మళ్లీ దీక్షాదివన్ ను ఘనంగా నిర్వహించేందుకు సంసిద్ధమైంది.

ప్రతీ జిల్లాలో ఇంఛార్జులను నియమించడంతో పాటు.. కరీంనగర్ నుంచే తెలంగాణా ఉద్యమానికి నాంది పలకడంతో ఈ దీక్షాదివస్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కానున్నారు. దీంతో నాడు కేసీఆర్ అరెస్ట్ అయిన అల్గనూర్ వద్దే అందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా అన్ని జిల్లాల్లో ఈ నవంబర్ 29వ తేదీన బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే దీక్షాదివన్ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శల జడివాన కురిపిస్తున్న నేపథ్యంలో నాటి చరిత్రకు ప్రత్యక్ష వేదికైన కరీంనగర్‌లో దీక్షాదివస్‌పై చర్చ సాగుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అలుగునూర్‌లో.. సుమారుగా పది వేయిల మందితో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటికే.. మొత్తం గులాబీ జెండాలతో నింపివేశారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటలకు ముగుస్తుంది.. కేటీఆర్‌ ఉపన్యాసంపై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి