అసెంబ్లీలో సస్పెన్షన్ రచ్చ.. మార్షల్స్‌లో కేటీఆర్, హరీష్‌రావు వాగ్వాదం! బయటికి వెళ్లిపోవాలంటూ..
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్‌ను అవమానించినందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభ నుండి వెళ్ళిపోయారు. స్పీకర్ పై విమర్శలు చేసినందుకు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌తో అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి, స్పీనర్‌ను అవమానించారనే కారణంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సెషన్ వరకూ ఆయనను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తరువాత అసెంబ్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత బీఆర్‌ఎస్ నేతలు సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. బీఆర్‌ఎస్ ఎల్పీ ఆఫీస్‌లోనే ఉన్న కేసీఆర్‌తో ఎమ్మెల్యేల భేటీ అయ్యేందుకు వెళ్లారు. బీఆర్‌ఎస్ఎల్పీ దగ్గర కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగదీష్‌రెడ్డిని బయటకు వెళ్లాలని మార్షల్స్ కోరారు. ఈ క్రమంలోనే మార్షల్స్‌తో కేటీఆర్, హరీష్‌రావు, తలసాని వాగ్వాదానికి దిగారు. ఎల్పీ రూమ్‌లో ఉంటే అభ్యంతరమేంటన్నని మార్షల్స్‌ను ప్రశ్నించారు. రూల్స్ ప్రకారం జగదీష్‌రెడ్డి బయటకు వెళ్లాల్సిందేనంటూ మార్షల్స్ పట్టుబట్టారు.
దీంతో రూల్ బుక్ చూపించాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో BRS నేతలు జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌పై నిరసన వ్యక్తం చేసేందుకు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు బయల్దేరి వెళ్లారు. కాగా సభ మీ ఒక్కరిదే కాదంటూ స్పీకర్‌ని ఉద్దేశించి ఉదయం జగదీష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలు స్పీకర్‌ని కించపరిచేలా ఉన్నాయని, జగదీష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్. అయితే ఈ అంశంపై పలువురు కాంగ్రెస్ నేతలు స్పందించారు. స్పీకర్ స్థానాన్ని అవమానించడం బాధాకరం, ఏకవాక్యంతో స్పీకర్ ఛైర్‌ను ప్రశ్నించారు, స్పీకర్‌పై గౌరవం లేకుండా మాట్లాడారు అంటూ వేముల వీరేశం అన్నారు.
స్పీకర్‌గా దళితుడు ఉన్నారనే అవమానించారు, చట్టసభల్లో వారి భాష ఎంతో అవమానకరం, దళితులను అవమానించే గుణం వారి డీఎన్‌ఏలోనే ఉందంటూ రామచంద్రనాయక్ విమర్శించారు. స్పీకర్ పదవి ఓ రాజ్యాంగ వ్యవస్థ అని, జగదీష్ రెడ్డి మాటలు అత్యంత అవమానకరం, నీకు నీకు అంటూ స్పీకర్ స్థానాన్ని కించపరిచారు, జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలంటూ మంత్రి సీతక్క కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.