Telangana Assembly Budget Highlights: తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు.. రైతులకు రుణ మాఫీ.. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం

Telangana Budget 2022 session Live Updates: శాసనసభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్​ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు.

Telangana Assembly Budget Highlights: తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు.. రైతులకు రుణ మాఫీ.. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం
Telangana Budget

| Edited By: Ram Naramaneni

Mar 07, 2022 | 2:53 PM


Telangana Budget 2022 session Updates: శాసనసభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్​ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. ఇది బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్‌ అని మంత్రి హరీశ్​ పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్‌ మార్క్‌ బడ్జెట్‌ అని అన్నారు.


LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 07 Mar 2022 01:20 PM (IST)

  జీహెచ్ఎంసీకి అగ్రతాంబూలం

  రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌కు అగ్రతాంబూలం దక్కింది. జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల మరమ్మతు పనులు రూ.858 కోట్లు కేటాయించారు. ఓఆర్ఆర్ చుట్టూ రూ.387 కోట్లతో సర్వీసు రోడ్డు నిర్మాణానికి కేటాయించారు. రూ.36.5 కోట్లతో గండిపేట చెరువు అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. రూ.1450 కోట్లతో సుంకిశాల నుంచి క్రిష్ణా జలాలకు హైదరాబాద్‌కు వచ్చే పైపు లైన్‌ నిర్మాణం జరుగుతోంది. దీనికి ఈ బడ్జెట్‌లో రూ.725 కోట్లు కేటాయిస్తున్నాం. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్‌మెంట్ కోసం రూ.3,866 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

 • 07 Mar 2022 12:51 PM (IST)

  దక్షిణాదిలో తెలంగాణ నెం.1 – హరీష్ రావు

  2021-22 నాటికి జీఎస్డీపీ రూ.11,54,860 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్డీపీ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్నారు. 2015-16 నుంచి 2020-21 మధ్య సగటున 11.7 శాతం ఆర్థిక వృద్ధి సాధించిందన్నారు. ఈ ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని హరీష్‌రావు వెల్లడించారు.

 • 07 Mar 2022 12:48 PM (IST)

  తెలంగాణ బడ్జెట్ 2022-23 ముఖ్యాంశాలు

  • పన్ను ఆదాయం - రూ.1,08,212 కోట్లు
  • కేంద్ర పన్నుల్లో వాటా - రూ.18,394 కోట్లు
  • పన్నేతర ఆదాయం - రూ.25,421 కోట్లు
  • గ్రాంట్లు - రూ.41,001 కోట్లు
  • రుణాలు - 53,970 కోట్లు
  • అమ్మకం పన్ను అంచనా - రూ.33 వేల కోట్లు
  • ఎక్సైజ్ ద్వారా ఆదాయం - రూ.17,500 కోట్లు
  • స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం - రూ.15,600 కోట్లు
 • 07 Mar 2022 12:46 PM (IST)

  కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాకౌట్

  గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలబడి నిరసన తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు.

 • 07 Mar 2022 12:44 PM (IST)

  అసెంబ్లీ ముందు ఎన్‌ఎస్‌యూఐ మెరుపు ధర్నా

  తెలంగాణ అసెంబ్లీ వద్ద ఎన్‌ఎస్‌యూఐ అధ్యర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగింది. బల్మూరి వెంకట్ నాయకత్వంలో అసెంబ్లీ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ప్రయత్నించారు. ఆర్టీసీ బస్‌లో వచ్చిన ఎన్‌ఎస్‌యూఐ నేతలు అసెంబ్లీ ముందు హఠాత్తుగా దిగి నిరసన తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

 • 07 Mar 2022 12:39 PM (IST)

  నిలబడి నిరసన తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలబడి నిరసన తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ తరువాత కూడా సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలబడి నిరసన తెలిపారు.

 • 07 Mar 2022 12:14 PM (IST)

  బడ్జెట్ 2022-23 కేటాయింపులు

  • నీటి పారుదల రంగానికి రూ.22,675 కోట్లు
  • ఆసరా పింఛన్ల పథకానికి రూ.11,728 కోట్లు
  • కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూ.2,750 కోట్లు
  • 9,123 స్కూళ్లలో మన ఊరు - మనబడికి రూ.3,497 కోట్లు
  • డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు
  • రోడ్లు, భవనాల కోసం రూ.1,542 కోట్లు
  • ఫారెస్ట్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు
  • బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.177 కోట్లు
  • బీసీ సంక్షేమం కోసం రూ.5,698 కోట్లు
  • ఎస్టీల సంక్షేమం కోసం 12,565 కోట్లు
 • 07 Mar 2022 12:11 PM (IST)

  బడ్జెట్ 2022-23 కేటాయింపులు

  • దళిత బంధుకు రూ. 17,700 కోట్లు
  • దళిత బంధు ద్వారా ఈ ఏడాది 11,800 కుటుంబాలకు లబ్ధి
  • వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు
  • హరిత హారానికి రూ.932 కోట్లు
  • పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు
  • అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు
  • కొత్త వైద్య కళాశాలలకు రూ.వెయ్యి కోట్లు
  • మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్ కాలేజీలు
  • సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం
  • తెలంగాణలో పామాయిల్ సాగుకు ప్రోత్సాహం, ఇందుకు రూ.వెయ్యి కోట్లు
  • రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు లక్ష్యం
 • 07 Mar 2022 12:09 PM (IST)

  రైతులకు పంట రుణాలు మాఫీ

  • రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ
  • వచ్చే ఆర్థిక ఏడాది నుంచి రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ
  • మొత్తం పంట రుణాలు రూ.16,144 కోట్లు మాఫీ
  • విడతల వారీగా 5.12 లక్షల మంది రైతులకు రుణాల మాఫీ ద్వారా లబ్ధి
 • 07 Mar 2022 12:07 PM (IST)

  బడ్జెట్ 2022-23ముఖ్యాంశాలు....

  • రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌
  • రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు
  • క్యాపిటల్‌ వ్యయం రూ.29,728 కోట్లు
  • దళిత బంధుకు రూ. 17,700 కోట్లు
  • గ్రామ పంచాయితీలకు ప్రతినెలా రూ. 227.5 కోట్లు
  • పట్టణ ప్రగతికి రూ. 1394 కోట్లు
  • మన ఊరు, మన బడి కోసం రూ. 3497 కోట్లు
 • 07 Mar 2022 12:06 PM (IST)

  దేశంలో అగ్రగామిగా తెలంగాణః హరీష్ రావు

  తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చిందని మంత్రి తెలిపారు. పారదర్శక విధానాలతో రాబడిని పెంచుకున్నామన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ అగచాట్లు పడిందని గుర్తుచేశారు. పోరాటం దశ నుంచి ఆవిర్భావం వరకూ తెలంగాణ కొత్తరూపం సంతరించుకుందని తెలిపారు. సవాళ్లు, క్లిష్టమమైన సమస్యలను అధిగమించామని చెప్పారు. పరిపాలనలో టీఆర్‌ఎస్‌ రాజీలేని వైఖరిని అవలంభించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

 • 07 Mar 2022 11:57 AM (IST)

  సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి తలసాని

  ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం చదువుతుండగా మంత్రి తలసాని శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలనే తీర్మానం ప్రవేశపెట్టగా.. స్పీకర్ దానికి ఆమోదం తెలిపారు. ఈ సెషన్ మొత్తం వారిని సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

 • 07 Mar 2022 11:53 AM (IST)

  తెలంగాణ బడ్జెట్

  2022-23 ఆర్థిక సంవత్సరంలో 2లక్షల 56వేల 958.51 కోట్ల రూపాయల బడ్జెట్
  రెవెన్యూ వ్యయం 1, 89,274. 82 కోట్లు.
  క్యాపిటల్ వ్యయం 29, 728.44 కోట్లు

 • 07 Mar 2022 11:53 AM (IST)

  బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్

  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ అసెంబ్లీ. బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రసంగాన్ని అడ్డుకుంటున్న బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావులను స్పీకర్ పోచారం సస్పెండ్ చేశారు. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యలేలు సభ వదిలి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు.

 • 07 Mar 2022 11:52 AM (IST)

  కేంద్రంపై మంత్రి హరీష్‌రావు ఫైర్

  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధ్యుత్ సంస్కరణలు రైతుల పాలిట గొడ్డలి పెట్టని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతుల నుంచి కరెంటు ఛార్జీలు వసూలు చేయాలని షరతు పెట్టింది. అది తెలంగాణ ప్రభుత్వ విధానం కానేకాదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎందుకంటే తెలంగాణ రైతు బిడ్డ పాలిస్తున్న ప్రభుత్వం. అంతా శుష్కప్రియాలు.. శూన్య హస్తాలే అన్నారు. పన్నుల రూపంలో 41 శాతం తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాలి. కానీ దొడ్డి దారిన పన్నులు వసూలు చేస్తోంది. కేంద్రం ఈ నిర్వాకాన్ని 15వ ఆర్థిక సంఘం కూడా తప్పుబట్టిందని మంత్రి హరీష్ రావు.

 • 07 Mar 2022 11:46 AM (IST)

  కేంద్రం రాష్ట్రాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదుః హరీష్‌రావు

  కరోనాతో సంక్షోభం ఎదురైనా కేంద్రం రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కంటితుడుపుగా షరతులతో కూడిన రుణ పరిమితి పెంచింది.

 • 07 Mar 2022 11:45 AM (IST)

  నీతి ఆయోగ్ సిఫార్సులు పట్టించుకోలేదుః హరీష్ రావు

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీలూ నెరవేర్చలేదని మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు.

 • 07 Mar 2022 11:44 AM (IST)

  కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేదుః హరీష్ రావు

  పార్లమెంటులో తెలంగాణ గురించి చర్చకు వచ్చిన ప్రతిసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రస్తుత పాలకులు అంటున్నారు. ఏ విషయంలోనూ కేంద్రం సహకారం లేదు. తెలంగాణకు రావాల్సిన ఐటీఆర్‌ భారీ ప్రాజెక్టును తప్పించి కేంద్రం భారీ తప్పు చేసింది. కేంద్ర సర్కారుకు ఎన్ని ప్రతిపాదనలు పంపినా, విన్నవించుకున్నా సహకారం లేదన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు.

 • 07 Mar 2022 11:42 AM (IST)

  తెలంగాణ టార్చ్ బేరర్: హరీశ్ రావు

  బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మంత్రి హరీశ్ రావు అరంభం నుంచి కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు.. ‘ప్రజలు కేసీఆర్ నాయకత్వం పట్ల మక్కువ చూపుతున్నారు. గతంలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. రాజకీయ, సామాజిక అసమానతల నుంచి స్వరాష్ట్రంగా అవతరించింది. అవమాన చరిత్ర నుంచి ఆత్మగౌరవం దిశగా తెలంగాన దూసుకుపోతుంది. ఇప్పుడు తెలంగాణ టార్చ్ బేరర్. ఇప్పుడు తెలంగాణ వ్యవహరిస్తున్నది.. రేపు భారత్ అనుసరిస్తోంది.’’ అని హరీష్ రావు అన్నారు.

 • 07 Mar 2022 11:40 AM (IST)

  హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం షురూ

  తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే జాతీయ గీతాలాపన అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు ప్రారంభం కావడంపై విపక్ష నేతలు నినాదాలు చేశారు. అయినా హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

  Harish Assembly

  Harish Assembly

 • 07 Mar 2022 11:37 AM (IST)

  సీఎల్పీ భేటీలో కీలక చర్చ

  తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశం అయ్యింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరుగింది. అసెంబ్లీలో అనుసరించాల్సి వ్యూహంపై సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

 • 07 Mar 2022 11:36 AM (IST)

  అమరవీరుల స్తూపానికి బీజేపీ ఎమ్మెల్యేల నివాళ్లు

  గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌, రఘునందన్‌ రావు నివాళులు అర్పించారు. రాజాసింగ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రాజ్యంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్‌కు అసలు విలువ ఇవ్వడమే లేదని ఆరోపించారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్‌ అరాచకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు శాసనసభలో కేసీఆర్‌ నుంచి కనుక సమాధానం రాకపోతే అక్కడే తేల్చుకుంటామని రాజాసింగ్‌ హెచ్చరించారు.

 • 07 Mar 2022 11:30 AM (IST)

  సీఎం కాన్వాయ్‌ అడ్డుకునేందుకు జేఏసీ యత్నం

  అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ ఓయూ విద్యార్థులు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని సీఎం కాన్వాయిని ఈరోజు అసెంబ్లీ ముందు అడ్డుకోవటం జరిగిందని ఓయూ జేఏసీ ఛైర్మన్ అర్జున్ నాయక్ తెలిపారు.

 • 07 Mar 2022 11:25 AM (IST)

  స్పీకర్‌కు బడ్జెట్ 2022-23 ప్రతులు

  తెలంగాణ బడ్జెట్ 2022-23 ప్రతులతో ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీకి చేరుకున్న వెంటనే తోటి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో కలిసి స్పీకర్ చాంబర్ కు వెళ్లారు. అక్కడి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి బడ్జెట్ ప్రతులను అందించారు.

  Harishrao Budget.mp4

  Harishrao Budget.mp4

 • 07 Mar 2022 11:19 AM (IST)

  జూబ్లీహిల్స్‌ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు

  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఆర్థిక మంత్రి హరీష్‌రావు.. జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  Harishrao.mp4

  Harishrao.mp4

 • 07 Mar 2022 11:14 AM (IST)

  రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ః హరీష్‌రావు

  సీఎం కేసీఆర్ ఆశీస్సులతో 3వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలకు ఇచ్చిన హామీలకు నేరవేర్చే దిశగా ఈ బడ్జెట్ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మానవీయ కోణంలో ఈ బడ్జెట్ ను రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉండబోతుందని మంత్రి హరీష్ వెల్లడించారు.

 • 07 Mar 2022 11:08 AM (IST)

  గన్ పార్క్ వద్ద BJP నిరసన

  గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై గన్ పార్క్ వద్ద నల్ల కండువాలతో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. 40, 50 ఏండ్లు నుంచి వస్తున్న సంప్రదాయాలను తుంగలో తొక్కి కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.

  Bjp Mla

  Bjp Mla

 • 07 Mar 2022 11:05 AM (IST)

  అందరి చూపు ఈటల పైనే

  ఈ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ ఎలా ఉన్నప్పటికీ అందరి చూపు మాత్రం ఈటల రాజేందర్‌పైనే ఉంది. ఏడేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఆయన తొలిసారిగా బీజేప ఎమ్మెల్యేగా సభలో అడుగుపెడుతున్నారు.

 • 07 Mar 2022 11:01 AM (IST)

  తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ ప్రసంగం. లైవ్‌లో చూద్దాం.

 • 07 Mar 2022 10:57 AM (IST)

  ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్న విపక్షాలు

  గవర్నర్‌ ప్రసంగంతో పాటు నిరుద్యోగ సమస్య, ధాన్యం కొనుగోలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్షాలు పేర్కొన్నాయి.

 • 07 Mar 2022 10:56 AM (IST)

  15రోజుల పాటు బడ్జెట్ సెషన్?

  అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ్టి బీఏసీ సమావేశంలో బడ్జెట్ సెషన్ సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ వెల్లడి కానుంది.

 • 07 Mar 2022 10:54 AM (IST)

  శాసనసభలో హరీష్‌రావు, మండలిలో ప్రశాంత్‌రెడ్డి..

  తెలంగాణ అసెంబ్లీ సమాశాల్లో భాగంగా తొలి రోజే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన సభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్‌ అనంతరం తెలంగాణ బీఏసీ సమావేశం జరగనుంది.

 • 07 Mar 2022 10:52 AM (IST)

  గవర్నర్‌ ప్రసంగం లేకుండానే..

  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభం అవుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Published On - Mar 07,2022 10:47 AM

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu