AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Injection Crimes: ప్రాణాలు నిలిపేందుకు వాడే సిరంజీలతో ఇలా చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్…

ప్రాణాలు కాపాడాల్సిన సిరంజీలు నేడు నేరస్తుల చేతుల్లో ప్రాణాలు తీసే ఆయుధాలుగా మారుతున్నాయి. ఆధారాలు దొరకవన్న భ్రమతో ఇంజక్షన్ల ద్వారా హత్యలు, మత్తు నేరాలు పెరుగుతున్నాయన్న ఆందోళనకర వాస్తవాన్ని వికారాబాద్, కర్నూలు, హైదరాబాద్ ఘటనలు బట్టబయలు చేస్తున్నాయి. పూర్తి వివరాలు కథనం లోపల...

Injection Crimes: ప్రాణాలు నిలిపేందుకు వాడే సిరంజీలతో ఇలా చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్...
Syringes
Vijay Saatha
| Edited By: |

Updated on: Jan 30, 2026 | 3:09 PM

Share

సిరంజీలు అంటే ప్రాణాలు కాపాడే వైద్య పరికరాలు. కానీ ఇటీవలి కాలంలో ఇవే నేరస్తుల చేతుల్లో ప్రాణాలు తీసే అస్త్రాలుగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పలు సంచలన ఘటనలు, సిరంజీలను ఉపయోగించి హత్యలకు పాల్పడుతున్న నేరస్తుల కొత్త మైండ్‌సెట్‌ను బయటపెడుతున్నాయి. హత్య చేయాలని నిర్ణయించుకుంటే చాలు… ఆధారాలు దొరకకుండా తప్పించుకునేలా సిరంజీలను ఆయుధాలుగా మార్చుకుంటున్నారు.

ఇటీవల వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తన ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డుగా నిలుస్తున్నారనే కారణంతో ఓ యువతి కన్నతల్లిదండ్రులనే సిరంజీతో హత్య చేసింది. సంగారెడ్డిలో నర్సుగా పనిచేస్తున్న సుజాత, వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులను నమ్మించి, “ఇంజక్షన్ వేయిస్తే నయం అవుతుంది” అంటూ హాస్పిటల్ నుంచి సిరంజీలను దొంగిలించింది. కూతురు మాటలను నమ్మిన తల్లిదండ్రుల విశ్వాసమే చివరకు వారి ప్రాణాలకు శాపంగా మారింది. తల్లిదండ్రులు లేకపోతే తన పెళ్లికి ఎవరూ అడ్డురారని భావించిన సుజాత, కర్కశంగా ఈ ఘాతుకానికి పాల్పడింది. ఇలాంటి సిరంజీ హత్యలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.

సిరంజీతో హత్య చేస్తే బయటకు స్పష్టమైన గాయాలు కనిపించవు, ఆధారాలు దొరకవు అన్న భ్రమే నేరస్తులను ఈ తరహా నేరాలకు ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రాణాలు పోసే సంజీవనిలా ఉండాల్సిన సిరంజీ, కొందరి చేతుల్లో యమపాశంగా మారుతోంది. కర్నూలు నగరంలో చోటు చేసుకున్న మరో సంచలన ఘటన ఈ కోవకే చెందుతుంది. తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడనే కసితో, మాజీ ప్రియురాలు వసుందర అతని భార్యకు వైరస్ ఇంజక్షన్ ఇచ్చేందుకు కుట్ర పన్నింది. డాక్టర్ కరుణాకర్, డాక్టర్ శ్రావణిల వివాహాన్ని జీర్ణించుకోలేని వసుందర, నలుగురితో కలిసి శ్రావణిపై దాడి చేయించింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కిందపడేసి, సహాయం చేస్తున్నట్టు నటిస్తూ HIV వైరస్ ఇంజక్షన్ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు మాజీ ప్రియురాలు వసుందరతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సిరంజీలు కేవలం హత్యలకే కాదు, మత్తుకు కూడా మారుతున్నాయన్న విషయం చంద్రాయణగుట్ట ఘటనతో బయటపడింది. ముగ్గురు యువకులు కలిసి మత్తు ఇంజక్షన్లు కొనుగోలు చేసి వినియోగించగా, డోసేజ్ ఎక్కువ కావడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనలో మత్తు ఇంజక్షన్లు విక్రయించిన వారిని కూడా చంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. సరదాగా మొదలైన మత్తు.. చివరకు ప్రాణాలు తీసిన ఘటనగా ఇది మారింది.

హైదరాబాద్ మలక్పేటలో ఏడాది క్రితం జరిగిన మరో కేసులోనూ మత్తు ఇంజక్షన్ కీలకంగా మారింది. నర్స్‌గా పనిచేసిన శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, పోస్టుమార్టం రిపోర్ట్‌లో గొంతు పిసికి చంపినట్టు తేలింది. దర్యాప్తులో ఆమె అక్క సరితే మత్తు మందు డోసేజ్ పెంచి ఇచ్చి హత్య చేసినట్టు ఒప్పుకుంది. వృత్తిపరమైన వివాదాలు, వ్యక్తిగత గొడవలు చివరకు సిరంజీ హత్యకు దారి తీసినట్లుగా పోలీసులు గుర్తించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..