AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryapet: జాతీయ రహదారిపై వాహనాలను సడన్‌గా ఆపి జిల్లా ఎస్పీ.. ఎందుకో తెలుసా..?

సాధారణంగా జాతీయ రహదారిపై పోలీసులు ఆపుతున్నారంటే ఏదో ఫైన్ వేస్తారని లేకుంటే తనిఖీ చేస్తారని వాహనదారులు కంగారు పడుతుంటారు. సూర్యాపేటలో జాతీయ రహదారి ఎన్ హెచ్ - 65 పై సీన్ రివర్స్ అయింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహన దారులను ఆపిన పోలీసులు వినూత్న రీతిలో స్వాగతం పలుకుతున్నారు. వాహనదారులకు పోలీసులు ఎందుకు స్వాగతం పలుకుతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

Suryapet: జాతీయ రహదారిపై వాహనాలను సడన్‌గా ఆపి జిల్లా ఎస్పీ.. ఎందుకో తెలుసా..?
Suryapet District Sp Narasimha Gave Roses
M Revan Reddy
| Edited By: |

Updated on: Jan 10, 2026 | 4:04 PM

Share

సాధారణంగా జాతీయ రహదారిపై పోలీసులు ఆపుతున్నారంటే ఏదో ఫైన్ వేస్తారని లేకుంటే తనిఖీ చేస్తారని వాహనదారులు కంగారు పడుతుంటారు. సూర్యాపేటలో జాతీయ రహదారి ఎన్ హెచ్ – 65 పై సీన్ రివర్స్ అయింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహన దారులను ఆపిన పోలీసులు వినూత్న రీతిలో స్వాగతం పలుకుతున్నారు. వాహనదారులకు పోలీసులు ఎందుకు స్వాగతం పలుకుతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

సాధారణంగా గులాబీ పువ్వులు ప్రేమికులు పరస్పరం ఇచ్చుకుంటారు. ఏదైనా కార్యక్రమానికి వచ్చే అతిథులకు కూడా పుష్పగుచ్ఛాలు ఇస్తుంటారు. కానీ సూర్యాపేట పోలీసులు మాత్రం వాహనదారులకు వినూత్నంగా రిసీవ్ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు సందడి చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ పట్నం వాసులంతా పల్లె బాట పడుతుండడంతో ఈ హైవే వాహనాల రద్దీ ఉంది. అయితే సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా సూర్యాపేట జిల్లా పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి , వారికి పువ్వులు అందించి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ప్రయాణ జాగ్రత్తలు వివరించారు.

సూర్యాపేట పట్టణంలోని జాతీయ రహదారి ఎన్ హెచ్ – 65 స్థానిక FCI గోడౌన్ వద్ద ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్న కార్లు, బస్సులను ఆపిన పోలీసులు చిరునవ్వుతో పలకరించి పండుగ శుభాకాంక్షలు చెబుతూ గులాబీ పూలు అందించారు. ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి ప్రయాణికులతో ముచ్చటించడం విశేషం. ప్రయాణికులు పండుగ సంతోషాన్ని తమ కుటుంబాలతో పంచుకోవాలని, రోడ్డు ప్రమాదాల బారిన పడకూడదని ఎస్పీ నరసింహ సూచనలు చేశారు. గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో అతివేగంగా వెళ్లవద్దని అన్నారు. సుదూర ప్రయాణాలు చేసే వారు అలసటగా అనిపిస్తే వాహనాన్ని పక్కన ఆపి విశ్రాంతి తీసుకోవాలని ఆయన సూచించారు.

పండుగ రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పండుగ ముగించుకుని తిరుగు ముఖం పట్టేటప్పుడు కూడా ఇదే అప్రమత్తత పాటించాలని ఆయన కోరారు. ప్రజలు తమ ఊర్లలో పండుగను సంతోషంగా జరుపుకుని, తిరిగి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నదే తమ ఆకాంక్షని ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట పోలీసుల తీరుపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తమ బాధ్యతను గుర్తు చేసిందని కొనియాడారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..