AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryapet: ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన బ్యాంక్ మేనేజర్..

సంతకం అనేది కేవలం పేరు రాసే గుర్తు కాదు.. ఒక వ్యక్తి అంగీకారానికి, అధికారానికి, బాధ్యతకు చట్టబద్ధమైన ముద్ర. ఒప్పందాలు, బ్యాంకింగ్ పత్రాలు,ఆస్తి పత్రాలు వంటి వాటిలో సంతకం కీలకంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో సంతకానికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఇటీవల కొందరు కేటుగాళ్లు సామాన్యుల నుంచి ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ జిల్లా అత్యున్నత పాలనాధికారి సంతకాన్ని ఓ కేటుగాడు ఫోర్జరీ చేశాడు చివరికి పోలీసుల రంగ ప్రవేశంతో కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Suryapet: ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన బ్యాంక్ మేనేజర్..
Raghu Prasad
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 18, 2026 | 4:03 PM

Share

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల కోసం సాధారణంగా జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ ఉన్నతాధికారుల పేరిట స్థానిక బ్యాంకుల్లో జాయింట్ ఖాతాలను నిర్వహిస్తుంటారు. శాఖకు సంబంధించిన నిధులను ఈ ఖాతాల్లో జమ చేయడంతోపాటు, అవసరమైన సందర్భాల్లో అధికారులు నిధులను డ్రా చేస్తుంటారు. అధికారులు బదిలీ అయినప్పుడు వారి సంతకాలను బ్యాంకు రికార్డుల్లో అప్‌డేట్ చేయడం సాధారణ ప్రక్రియ.

అయితే సూర్యాపేట జిల్లాలో ఇదే సంతకాల అప్‌డేట్ ప్రక్రియను ఆసరాగా చేసుకుని ఓ బ్యాంకు మేనేజర్ ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేయడం కలకలం రేపింది. డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేరిట ఉన్న జాయింట్ బ్యాంకు ఖాతాకు సంబంధించిన సంతకాల అప్‌డేట్ ప్రక్రియలో కొటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజర్ రఘు ప్రసాద్ అక్రమానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

సంతకాల అప్‌డేట్ పేరుతో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంతకాన్ని రఘు ప్రసాద్ ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ప్రభుత్వ ముద్ర కోసం ఫోర్జరీ చేసిన పత్రాలను తీసుకుని సూర్యాపేట కలెక్టరేట్‌కు వచ్చాడు. అయితే కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రత్యేకమైన రంగుతో సంతకం చేస్తుండటంతో.. రఘు ప్రసాద్ తీసుకొచ్చిన పత్రాల్లోని సంతకం రంగు భిన్నంగా ఉండటాన్ని కలెక్టరేట్ సహాయక సిబ్బంది గమనించారు.

దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది వెంటనే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పత్రాలను పరిశీలించిన కలెక్టర్.. తన సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఫిర్యాదు మేరకు చివ్వెంల పోలీసులు కేసు నమోదు చేసి కొటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజర్ రఘు ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు.

జిల్లా పాలనాధికారి సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘటన సూర్యాపేటలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడానికి రఘు ప్రసాద్ ఎందుకు ప్రయత్నించాడు? ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా? ఫోర్జరీ చేసిన పత్రాలను ఉపయోగించి ప్రభుత్వ నిధులకు సంబంధించిన ఎలాంటి అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us