Telangana: మంత్రాలు చేస్తున్నాడని అనుమానం.. దానికి కారణం అతడేనంటూ మాటేసి..
ఆధునిక సాంకేతిక రంగం ఎంతో ఎదుగుతున్నా.. కొన్ని చోట్ల ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి.. మంత్రాలు, క్షుద్రపూజలంటూ చాలా చోట్ల మనుషులు తెగ భయపడిపోతున్నారు.. ముఢ నమ్మకాలను నమ్మవద్దంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మెదక్, ఫిబ్రవరి 10: ఆధునిక సాంకేతిక రంగం ఎంతో ఎదుగుతున్నా.. కొన్ని చోట్ల ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి.. మంత్రాలు, క్షుద్రపూజలంటూ చాలా చోట్ల మనుషులు తెగ భయపడిపోతున్నారు.. ముఢ నమ్మకాలను నమ్మవద్దంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొందరు వాటిని నమ్ముతూ.. నేరాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. మంత్రాల నేపంతో ఓ వ్యక్తిని హత్యచేసిన సంఘటన తెలంగాణలో కలకలం రేపింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఘనపూర్ గ్రామ తాజామాజీ సర్పంచ్ భర్త బత్తుల తిరుపతి బిడ్డ అనారోగ్యానికి గురైంది. తన బిడ్డ అనారోగ్యానికి అదే గ్రామానికి చెందిన బండి వెంకటయ్య కారణమని భావించాడు. మంత్రాలు చేయడం వల్లనే తన కూతురు ఆరోగ్యం బాగుండటం లేదని కక్ష పెంచుకున్నాడు.
ఎలాగైనా వెంకటయ్యను చంపితేనే తన బిడ్డ ఆరోగ్యం బాగుంటుందని అనుకున్నాడు. దీంతో వెంకటయ్యను హతమార్చేందుకు నంగునూరుకు చెందిన పరశురాములు, సాయిగౌడ్ లతో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా రూ.50 వేలు, మరో పది రోజులకు రూ. లక్ష అడ్వాన్స్ గా ఇచ్చాడు.
ఈ క్రమంలో.. ఈ నెల 3న నంగునూరు నుంచి ఘనపూర్ వైపు వెళ్తున్న వెంకటయ్యను చంపేందుకు ప్లాన్ రచించారు. పరశు రాములు, సాయిగౌడ్ తో పాటు మరో ముగ్గురు సాయి, అరవింద్, రంజిత్ సహాయంతో వెంకటయ్యను బైక్ పై వెంబడించారు. ఘనపూర్ శివారులోకి వెళ్లగానే వెంకటయ్య బైక్ ను ఢీకొట్టారు.
అనంతరం వారు వెంట తెచ్చుకున్న తువాలు, తాడు సహాయంతో వెంకటయ్యను హత మార్చి జేసీబీ గుంతలో పడేశారు. ఆ తర్వాత.. ఈ ఘటనను యాక్సిడెంట్ గా చిత్రీకరించారు.
ఈ ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానం రావడంతో.. తమదైన శైలిలో విచారణ చేపట్టారు. బత్తుల తిరుపతి సహా.. నిందితులను విచారించగా.. వారంతా నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించినట్లు సిద్ధిపేట రూరల్ సీఐ శ్రీను తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
